Home » కంచుకోటలపై కాంగ్రెస్ కన్ను …

కంచుకోటలపై కాంగ్రెస్ కన్ను …

గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో అసలు పరిస్థితి ఏంటి?
గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరే?”
బీఆర్ఎస్ బలాన్ని దెబ్బతీయాలని కాంగ్రెస్ వ్యూహాలు

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలపై అధికార కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మూడు స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిపత్యానికి చెక్ పెట్టి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అయితే గ్రౌండ్ స్థాయిలో కనిపిస్తున్న రాజకీయ పరిస్థితులు మాత్రం కాంగ్రెస్ ఆశలకు పూర్తి స్థాయిలో అనుకూలంగా లేవని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ బలాన్ని తగ్గించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నప్పటికీ, స్థానికంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఆ వ్యూహానికి ప్రతికూలంగా మారుతున్నట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.

సిద్దిపేటలో కాంగ్రెస్‌కు వర్గపోరు సవాల్…..

హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పూజల హరికృష్ణ వర్గం, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వర్గాల మధ్య కొనసాగుతున్న విభేదాలు పార్టీ బలోపేతానికి అడ్డంకిగా మారుతున్నాయని చెబుతున్నారు.

గజ్వేల్‌లో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం ఇంకా కనిపించలేదా?

కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో కూడా కాంగ్రెస్ అంతర్గత సమస్యలతోనే సతమతమవుతోందని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. పాత కాంగ్రెస్ నాయకులకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండటం పార్టీ ఐక్యతపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. అభివృద్ధి నిధులు, ప్రోటోకాల్ అంశాల్లోనూ విభేదాలు బయటపడుతున్నాయనే ప్రచారం ఉంది.

సిరిసిల్లలో బీజేపీ పెరుగుతున్న ప్రభావం….

కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో బలపడలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక నాయకత్వ లోపం కారణంగా కేటీఆర్ వ్యతిరేక ఓటును సమీకరించడంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందంజలో ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ ముందున్న అసలు పరీక్ష ఇదే……

బీఆర్ఎస్ కంచుకోటల్లో విజయాన్ని నమోదు చేయాలంటే ముందుగా స్థానికంగా నెలకొన్న అసంతృప్తి, వర్గపోరు, నాయకత్వ సమస్యలను కాంగ్రెస్ పరిష్కరించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం రాజకీయ ప్రకటనలు, చేరికలతోనే బీఆర్ఎస్ బలమైన కంచుకోటలను ఛేదించడం సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నప్పటికీ, ఆ మార్పులను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ఏ పార్టీ విజయవంతమవుతుందనేది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *