భార్యతో సహా లొంగిపోయిన రాష్ట్ర కమిటీ సభ్యుడు లచ్చన్న
45 ఏళ్ల ఉద్యమంలో ఇంటివైపు చూడని నేపథ్యం
భార్య చౌదరి అంకుబాయి కూడా 38 ఏళ్ళు అజ్ఞాతంలోనే
Mavoist : మావోయిస్టు పార్టీ వరుస ఎదురు దెబ్బలతో తట్టుకోలేక పోతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో నష్టాలను ఎదుర్కొంటోంది. ఎన్కౌంటర్ లో కీలక నేతలు నేల రాలుతున్నారు. కొందరు లొంగిపోతున్నారు. చర్చలకు మావోయిస్టు పార్టీ ముందుకు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్నఅలియాస్ గోపన్న అతని భార్య చౌదరి అంకుబాయి అలియాస్ వనితక్క, అరుణ తో కలిసి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో లొంగిపోయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం పారుపెల్లి గ్రామానికి చెందిన లచ్చన్న 1980 లో మావోయిస్టు పార్టీలో చేరాడు. దళంలో చేరిన ఆయన సిర్పూర్ దళంలో విధులు నిర్వహించాడు. అదే దళంలో డిప్యూటీ కమాండర్, దళ కమాండర్ గా పనిచేశాడు. అక్కడి నుంచి నేరుగా పార్టీ ఆయుధ తయారీ లో చేరాడు. దళంలో చేరిన నాటి నుంచి లచ్చన్న ఎన్నడు కూడా ఇంటి వైపు చూడలేదు. అగర్ గూడ, పెంచికల్ పేట ప్రాంతాల్లో లచ్చన్న తప్పించుకున్నాడు. రెండు నెలల కిందట లచ్చన్న, భార్య వనితక్క తో కలిసి మంచిర్యాల జిల్లాలోని శ్రీరామ్ పూర్, మంచిర్యాల రహదారులపై మోటార్ సైకిల్ పై వెళ్లినట్టు సమాచారం. అప్పటి నుంచే లొంగిపోడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని తెలిసింది.
ఇదిలా ఉండగా భార్య చౌదరి అంకూ బాయి అలియాస్ వనితక్క, అరుణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత పెంచికల్ పేట మండలం అఘర్ గూడ గ్రామ నివాసి. ఆమె 1987 లో దళంలో చేరి కొద్ధి రోజుల పాటు సిర్పూర్ దళంలో పనిచేసింది. ఛత్తీస్ ఘడ్ బస్తర్ డివిజన్ కమిటీ సెక్రెటరీగా అరుణ పనిచేస్తోంది. అరుణ కూడా పార్టీలో చేరిన నాటి నుంచి ఇంటివైపు రాలేదు. ఆత్రం లచ్చన్న, భార్య అరుణ లొంగిపోతున్నట్టుగా సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది.

by