Congress : తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. చెన్నూర్ నియోజక వర్గంలో కాంగ్రస్ పార్టీ పదిహేన్నేళ్ల తరువాత పార్టీ అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకట స్వామి విజయం సాధించారు. పదహారు సంవత్సరాల అనంతరం నియోజక వర్గం నుంచి గెలిచిన వివేక్ కు మంత్రి పదవి దక్కింది. ఇన్నేళ్ల పాటు చెన్నూర్ నియోజకవర్గం క్యాడర్ రాజకీయ నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతూ కాలం గడిపారు. ఎట్టకేలకు పార్టీ అధికారం చేపట్టడం, నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కడంతో నియోజకవర్గం లోని క్యాడర్ ఆనందంలో ఉంది. రాజకీయ నిరుద్యోగులైన పార్టీ శ్రేణులు కొందరు ఇప్పుడు పదవుల కోసం ఆరాట పడుతున్నారు. నాకో పదవి కావాలంటూ మంత్రి వివేక్ తో పాటు ఆయన పీఏ ల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. అంతే కాదు పలానా వ్యక్తి కి పదవి ఇస్తే పార్టీ నాశనం అవుతుంది అంటూ మంత్రి ఎక్కడ ఉంటె అక్కడికి వెళ్లి చెవులు కొరికి వస్తున్నారు.
ప్రస్తుత మంత్రి బీజేపి, బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నియోజకవర్గం క్యాడర్ ప్రస్తుత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ వెంట నడిచారు. ఎన్నికల సమయంలో వాళ్లంతా కూడా తిరిగి వివేక్ వెంట నడిచారు. అప్పుడు ప్రేమ్ సాగర్ రావ్ తో సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలను ఇప్పుడు వివేక్ చూపిస్తూ కొందరు నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. వీళ్లంతా ప్రేమ్ సాగర్ రావ్ మనుసులు అంటూ నిందలు మోపుతున్నారు. అటువంటి వారు నమస్కారం సార్ అంటే మంత్రి మొహం తిప్పుకొని వెళుతున్నారు. ఇప్పుడు వారందరికీ తమ శీల పరీక్ష ఎలా నిరూపించుకోవాలో తెలియక కుడితిలో పడ్డ ఎలుకలా పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందుతున్నారు.
మంచిర్యాల జిల్లా అధ్యక్ష పదవి కోసం మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, రఘనాథ్ రెడ్డి, నూకల రమేష్ ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ఈ పదవి పురాణం కె దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ రాజకీయ పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. అయన కండువా కప్పుకున్నప్పుడే అభయం దక్కినట్టు సమాచారం. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం సొతుకు సుదర్శన్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ కోసం బండి సదానందం యాదవ్, నేతకాని కార్పొరేషన్ చైర్మన్ కోసం దుర్గం నరేష్, గీత పారిశ్రామిక డైరెక్టర్ కోసం నోముల ఉపేందర్ గౌడ్ ఆరాట పడుతున్నారు.
మందమర్రి పట్టణ పార్టీ అధ్యక్ష పదవి కోసం 15 మంది నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇందులో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఒక నాయకుడు తానే గొప్ప అంటూ మిగిలిన 14 మంది నాయకుల పై తప్పుడు నివేదికలను మంత్రికి చేరవేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. అంతే కాదు పట్టణ అధ్యక్ష పదవి కోసం మంత్రి వద్ద నిత్యం సన్నిహిత్యంగా ఉండే ఒకరికి రూ : 2 లక్షలు ఆ నాయకుడు ఇచ్చినట్టుగా ఆరోపణలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తెలిసిన కొందరు నాయకులు ఏకమై అధ్యక్ష పదవి కోసం ఆరాటపడుతున్న ఆ నాయకుడి జాతకం తయారు చేసి మంత్రికి నివేదించడానికి సిద్ధం కావడం కొసమెరుపు.