TTD : ” రన్ ” అనే తెలుగు సినిమా చాల మంది చూసే ఉంటారు. అయినా ఆ సినిమా ఎప్పుడో చూసి ఉంటారు. అందులోని సన్నివేశాలు ఎందుకు గుర్తుంటాయి. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఆ ” రన్ ” సినిమాలోని నటుడు సునీల్ సన్నివేశానికి, తిరుపతి వెంకన్న సామి లడ్డు ప్రసాదం తయారీకి వాడిన నెయ్యి సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ముందుగా నటుడు సునీల్ రన్ సినిమా సన్నివేశానికి వద్దాం.
నటుడు సునీల్ రోడ్ వెంట వెళుతున్న సమయంలో అతనికి ఐదు రూపాయలకే బిర్యానీ అంటూ బోర్డు కనిపిస్తుంది. ఐదు రూపాయలు ఇచ్చేసి బిర్యానీ తినేస్తాడు. తిన్న వెంటనే సునీల్ కాకిలా అరుస్తాడు. వెంటనే ఆ హోటల్ యజమానిని అడుగుతాడు. ఏమిటి నా నోటి వెంట కాకి అరుపులు వస్తున్నాయి అని నిలదీస్తాడు. నీవు ఇచ్చిన ఐదు రూపాయలకు కాకి అరుపులు కాకుండా కోడి అరుపులు వస్తాయా అంటూ ఆ యజమాని సునీల్ ను దబాయిస్తాడు. అప్పుడు సునీల్ కు జ్ఞానోదయం అవుతుంది. నేను తిన్నది చికెన్ బిర్యానీ కాదు, కాకి మాంసం బిర్యానీ అని తెలిసి పోతుంది. ఐదు రూపాయలకు బిర్యానీ అని ఆశపడ్డాడు సునీల్, కానీ ఐదు రూపాయలకు బుద్ది ఉన్నోడు ఎవడైనా చికెన్ బిర్యానీ పెడుతారా అని మాత్రం ఆలోచించలేదు సునీల్.
రాజస్థాన్ నుంచి స్వచ్చమైన ఆవునెయ్యి కిలో రూ : 1667 చొప్పున కొన్నామని టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి నేతిలేని నీతి మాటలు మాట్లాడారు. లడ్డూ ప్రసాదానికి కిలో రూ : 320 చొప్పున కొన్నామని సుబ్బారెడ్డే చెబుతున్నారు. ఒకవైపేమో కిలో 1667 అని ఆయనే చెబుతున్నారు. మరో ధర 320 అని ఆయనే చెబుతున్నారు. రెండు ధరలు ఆయనే చెబుతున్నారు. అటువంటప్పుడు కిలో ఆవునెయ్యి 320 లకు ఎలా మార్కెట్ లో దొరుకుతుందో ఆయనే చెప్పాలి. సుమారు 20 లీటర్ల పాల నుంచి ఒక కిలో నెయ్యి వస్తుంది. రైతు లీటర్ పాలను ఎంత లేదన్నా అరవై రూపాయల కంటే తక్కువకు అమ్మలేడు. అంటే 20 లీటర్ల పాలకు 1200 రూపాయలు. అటువంటప్పుడు ఎక్కడి నుంచో కిలో ఆవునెయ్యి 320 రూపాయలకు ఎలా తిరుపతి వెంకన్న సన్నిధికి చేరుకుంటుందో ఆ సుబ్బారెడ్డి సెలవియ్యాలి.
….. మేము చెప్పిన సునీల్ ఐదు రూపాయల బిర్యానీ కథకు … తిరుపతి వెంకన్న సామి నెయ్యి కి మీరు అల్లిన కథకు….ఇప్పుడు సరిపోయింది అనుకుంటా సుబ్బారెడ్డి……