120 యూనిట్ల రక్త సేకరణకు గుర్తింపు
తలసేమియా బాధిత చిన్నారుల కోసం మరిన్ని సేవలు
డాక్టర్ బాలు
కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 120 యూనిట్ల రక్తాన్ని సేకరించి విశేష సేవలందించిన బీబీపేట వాసవి క్లబ్ కు “తలసేమియా లైఫ్ సేవర్ అవార్డు–2026” ప్రదానం చేశారు. ఈ అవార్డును ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్ సంయుక్తంగా అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తలసేమియా బాధిత చిన్నారుల కోసం 2025 సంవత్సరంలో 120 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని వాసవి క్లబ్‌లలో ప్రథమ స్థానంలో నిలిచిన వాసవి క్లబ్ బీబీపేట్‌కు ఈ అవార్డును ప్రదానం చేయడం గర్వకారణమన్నారు.
తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒకసారి జీవితాంతం రక్తం అవసరమవుతుందని, అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ముందుకొచ్చిన వాసవి క్లబ్ సభ్యుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ప్రతి సంవత్సరం తలసేమియా చిన్నారుల కోసం కనీసం ఒక రక్తదాన శిబిరాన్ని నిర్వహించాలని విజ్ఞప్తి చేయగా, వాసవి క్లబ్ సభ్యులు సానుకూలంగా స్పందించి భవిష్యత్తులో కూడా ఇలాంటి శిబిరాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటివరకు తలసేమియా బాధిత చిన్నారుల కోసం 6,000 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించినట్లు డాక్టర్ బాలు వెల్లడించారు. యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాల నిర్వహణలో మరింత చురుకుగా పాల్గొని తలసేమియా బాధితులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు పర్ష వెంకటరమణ, వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రెడ్డిశెట్టి శ్రీనివాస్, వైస్ గవర్నర్ భాశెట్టి నాగేశ్వర్, జోన్ చైర్మన్ తొడుపునూరి నాగభూషణం, విశ్వమోహన్, నంగునూరి చంద్రశేఖర్, బచ్చు రామచందం, నీల బైరయ్య, రెడ్డిశెట్టి వెంకటేశం, పెద్ది నాగయ్య, ఇల్లందుల ఆంజనేయులు, తొడుపునూరి శ్రీనివాస్తో పాటు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

by