Home » పార్టీస్వామ్యం వద్దు.. బీసీ రాజ్యాధికారం ముద్దు

పార్టీస్వామ్యం వద్దు.. బీసీ రాజ్యాధికారం ముద్దు

బీసీ లకు దక్కని రాజకీయ పదవులు
రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ కుటుంబ ఆధిపత్యం
తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పేరం అలేఖ్య

కోల్ బెల్ట్ న్యూస్ (మంచిర్యాల):

దేశంలో గత 75 సంవత్సరాలుగా కొనసాగుతున్న పార్టీల ఆధారిత రాజకీయ వ్యవస్థ కారణంగా ప్రజాస్వామ్యం పేరుకే పరిమితమైందని, బీసీలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యం దక్కడం లేదని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది పేరం అలేఖ్య పేర్కొన్నారు.ఆదివారం మంచిర్యాల లో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ …రాజకీయ పార్టీల్లో టికెట్ కేటాయింపు నుంచి మంత్రి పదవుల వరకు కుటుంబ ఆధిపత్యం, ధనబలం కీలకంగా మారాయని ఆమె విమర్శించారు. దీంతో అర్హత, సామర్థ్యం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులకు రాజకీయాల్లో అవకాశాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో బీసీలు సుమారు 52 శాతం జనాభా ఉన్నప్పటికీ, శాసనసభలో కేవలం 15 శాతం, రాష్ట్ర మంత్రివర్గంలో సుమారు 20 శాతం ప్రాతినిధ్యానికే పరిమితమయ్యారని ఆమె పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాలు, వ్యవసాయం, రాజకీయాలు సహా ప్రతి రంగంలోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రధాన నినాదం “పార్టీస్వామ్యం వద్దు.. బీసీ రాజ్యాధికారం ముద్దు” అని స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థలోనే రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసి, ఎన్నికల టికెట్ల కేటాయింపులో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే బీసీ నాయకులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వంటి అత్యున్నత పదవుల్లో అవకాశాలు కల్పించాలని, సామాజిక న్యాయం సాధనకు బీసీల రాజకీయాధికారాన్ని స్థాపించాలని కోరారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని, అధికారాన్ని పంచే సమయంలో మాత్రం విస్మరిస్తున్నాయని ఆరోపించారు. ఇకపై ఈ పరిస్థితిని సహించబోమని, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పేరం అలేఖ్య స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *