బీసీ హక్కుల కోసం పోరాటం
రాజకీయంగా బీసీ లు ఎదగాలి
పేరం అలేఖ్య నటేశ్వర్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
బీసీ సమాజం ఐక్యమై రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని బీసీ మహిళ రాష్ట్ర కన్వీనర్, న్యాయవాది పేరం అలేఖ్య నటేశ్వర్ పిలుపునిచ్చారు. మంచిర్యాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీల ఐక్యత లోపించడమే వారి వెనుకబాటుతనానికి ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. కులాలు, మతాలు, రాజకీయ పార్టీల పేరుతో బీసీ సమాజాన్ని విభజించడం వల్ల వారి సామూహిక శక్తి బలహీనపడిందన్నారు. ఫలితంగా బీసీలకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన హక్కులు, అవకాశాలు పూర్తిస్థాయిలో అందడం లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బీసీ సమాజం ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, కులవృత్తుల క్షీణత, కుటుంబ సమస్యలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆమె తెలిపారు. రాజకీయ పార్టీలపై ఆధారపడకుండా రాజ్యాంగ విలువలను అర్థం చేసుకొని ప్రతి కుటుంబం చైతన్యవంతం కావాలని సూచించారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వాన్ని హామీ ఇస్తున్నప్పటికీ, బీసీల విషయంలో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. అందువల్ల బీసీ పెద్దలు, యువత, మహిళలు, న్యాయవాదులు సమాజ హక్కుల సాధన కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, సర్దార్ పాపన్న గౌడ్, చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని బీసీ సమాజం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీసీ సమాజం, ఇప్పుడు సామాజిక న్యాయం మరియు రాజకీయ సాధికారత కోసం కూడా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. “బీసీ మేలుకో… రాజ్యమేలుకో” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ బీసీ చైతన్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో కోడూరు చంద్రయ్య, గుమ్ముల శ్రీనివాస్, వడ్డేపల్లి మనోహర్, లీలావతి తదితరులు పాల్గొన్నారు.

by