మళ్లీ రెండెకరాలకే పరిమితమా ?
2024 వానాకాలం సీజన్‌లో రైతుబంధుకు మొండిచేయి
పంపిణీపై రైతుల్లో అనుమానాలు
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
ముఖ్యమంత్రి రాష్ట్రంలోని రైతులందరికీ తొమ్మిది రోజుల వ్యవధిలో రైతుభరోసా నిధులను విడుదల చేస్తామని ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎకరాకు రూ.6 వేల చొప్పున మొత్తం సాగు విస్తీర్ణానికి పెట్టుబడి సాయం అందుతుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నప్పటికీ, గత అనుభవాల నేపథ్యంలో కొందరు రైతుల్లో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 2018లో అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించి ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. 2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆర్థిక సహాయాన్ని 2023-24 యాసంగి సీజన్‌లో కొనసాగించింది. అయితే 2024 వానాకాలం సీజన్‌లో రైతుబంధు అమలు కాలేదు.
తర్వాత రైతుబంధు పథకాన్ని “రైతుభరోసా”గా మార్చి, 2024-25 యాసంగి సీజన్‌లో ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే 2025-26 యాసంగి సీజన్‌లో ప్రభుత్వం ఎకరాకు రూ.6 వేల చొప్పున కేవలం రెండు ఎకరాల వరకు మాత్రమే రైతుభరోసా సాయం అందించింది. దీంతో పెద్ద మొత్తంలో రైతులు పూర్తి స్థాయి లబ్ధిని పొందలేకపోయారు. ఈ నేపథ్యంలో రానున్న వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం పూర్తి సాగు విస్తీర్ణానికి రైతుభరోసా నిధులు అందిస్తుందా, లేక మళ్లీ రెండు ఎకరాల పరిమితినే అమలు చేస్తుందా అనే సందేహాలు రైతుల్లో నెలకొన్నాయి.
ముఖ్యమంత్రి చేసిన తాజా ప్రకటన ప్రకారం తొమ్మిది రోజుల వ్యవధిలో రైతులందరికీ రైతుభరోసా నిధులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.7 వేల కోట్లకు పైగా పెట్టుబడి సాయాన్ని ఏడు రోజుల్లో విడుదల చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం ఎకరాకు సాయాన్ని రూ.6 వేలకు పెంచడంతో మొత్తం వ్యయం రూ.9 వేల కోట్లకు చేరనుంది. రోజుకు ఒక్కో ఎకరా విస్తీర్ణం చొప్పున లబ్ధిదారుల పరిధిని విస్తరిస్తూ నిధులను విడుదల చేస్తే రాష్ట్రంలోని సాగుభూమి మొత్తానికి రైతుభరోసా వర్తించే అవకాశాలు ఉన్నాయని రైతులు భావిస్తున్నారు. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించనున్న రైతు సమ్మేళనంలో రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ రోజు నుంచే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కావడం ప్రారంభమవుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

by