Chennoor : మాజీ మంత్రి బోడ జనార్దన్ హయాంలో చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించడంలో అర్థం లేదని, నియోజకవర్గం అభివృద్ధి విషయంలో బాల్క సుమన్ చర్చకు రావాలని మాజీ మంత్రి బోడ జనార్దన్ సుమన్ కు సవాల్ విసిరారు. లేనిచో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శుక్రవారం చెన్నూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సంధర్బంగా జనార్దన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తాను అభివృద్ధి చేసిన నేపథ్యంలోనే వరుసగా నాలుగుసార్లు ప్రజలు బ్రహ్మ రథం పట్టారన్నారు. ఈ రికార్డు ను భవిష్యత్తులో ఏ నాయకుడు కూడా సాధించలేడని, సాధించడం కూడా సాధ్యం కాదని జనార్దన్ స్పష్టం చేశారు.
నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోకపోవడంతోనే ఒకసారి గెలిచిన నాయకులు మరోసారి ఓటమి చెందుతున్నారన్నారు. తానూ ఎమ్మెల్యే అయిన తరువాత చెన్నూర్ లో బొగ్గు గనుల నిర్మాణం చేపట్టి, కార్మికులకు క్వార్టర్లను కూడ నిర్మించి ఇచ్చామన్న విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. నా తరువాత వచ్చిన నాయకుల హయాంలో ఆ గనులు మూత పడ్డాయని, వాటిని ఎందుకు కొనసాగించలేదని ప్రశ్నించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచి పదేళ్లు ఉన్న సుమన్ ఎందుకు వాటికి తిరిగి ప్రారింభించలేదన్నారు. పాలకేంద్రం ఏర్పాటుచేస్తే, దాన్ని కూడా నా తరువాత వచ్చిన పాలకులు మూసివేయించారన్నారు. దింతో కేంద్రం పై ఆధారపడిన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయన్నారు. పట్టు పరిశ్రమ తీసుకువచ్చి, ఉపాధి కల్పించామన్నారు. మారుమూల ప్రాంతాలకు రోడ్డు, రవాణా, విద్య, వైద్యం, విద్యుత్ సౌకర్యాలు అందించిన ఘనత కూడా నాదేనని ఆయన స్పష్టం చేశారు.
మందమర్రికి శాశ్వత తాగునీటి పథకం ప్రారంభిస్తే, నేటికీ కూడా ఏ సమయానికి తాగు నీరు వస్తుందో తెలిసే పరిస్థితిలేదని ఆయన ఆరోపించారు. మందమర్రిలో జూనియర్ కళాశాల, ఒకేచోట ప్రభుత్వ రెవెన్యూ, ఎంఇఓ, వ్యవసాయ, ఎంపిడిఓ కార్యాలయాలను ఏర్పాటుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. మందమర్రి కి లెథర్ పార్క్ మంజూరు చేయిస్తే ఇరువై ఏళ్ల నుంచి ప్రారంభానికి నోచుకోలేదన్నారు. నేషనల్ హై వే తన హయాంలోనే మంజూరైన విషయం ప్రజలకు తెలుసన్నారు. తుంతుంగ, నీల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టులు తన హయాంలో మంజూరు చేయించి నిధులు మంజూరు చేయించిన విషయం సుమన్ కు తెలియకపోవచ్చు కాని ప్రజలకు తెలుసన్నారు.
ఒంటరిగా ఒక్కణ్ణే విలేకరుల సమావేశంలో మాట్లాడితే బలం లేదనుకోవడం పొరపాటని, తన బలమేమిటో నియోజకవర్గం ప్రజలకు తెలుసన్నారు. తానూ కొందరి నాయకుల మాదిరిగా గోదావరి ఇసుక దోపిడి చేసి అక్రమంగా సంపాదించలేదని , ఇసుకతో సంపాదించిన వారు కూడా ఎవరో ప్రజలకు తెలుసన్నారు. అక్రమ వసూళ్లు, భూకబ్జాలు, ఇసుక దందా, ప్రజలను పట్టించుకోకపోవడం, అభివృద్ధి చేయకపోవడంతోనే ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారన్నారు. నీతిగా, నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేయడంతోనే చెన్నూర్ నియోజక వర్గం ప్రజలు వరుసగా నాలుగు సార్లు ఆదరించారని జనార్దన్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

by