గని కార్మికుడికే TBGKS పట్టాభిషేకం
సింగరేణిలో 26 ఏళ్ల కార్మిక అనుభవం
నూతన భాద్యతలకు తోడైన రాజకీయ అనుభవం
Singareni : గులాబీ జెండా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ చూసినా రెపరెపలాడింది. అదే స్థాయిలో రాష్ట్రంలో పదేళ్లు అధినేత కేసీఆర్ పరిపాలన. సింగరేణిలో సైతం రెండు దఫాలుగా పార్టీ అనుబంద సంఘమైన టీబీజీకేఎస్ కార్మిక గుర్తింపు సంఘంగా తన విజయ పతాకాన్నీ ఎగురవేసింది. పరిపాలన పరంగా జరిగిన పొరపాటుకు రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ దూరమైనది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం సింగరేణిలో నిర్వహించిన గుర్తింపు సంఘం ఎన్నికలకు ఓటమి భయంతో టీబీజీకేఎస్ ముందుకు రాలేదు.
పార్టీలో ఏర్పడిన లుకలుకల నేపథ్యంలోనే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగానే ఎమ్మెల్సీ కవిత కొద్ది రోజులు కొనసాగారు. అవి కాస్త ముదరడంతో కవితను యూనియన్ భాద్యతలను తొలగిస్తున్నామని పార్టీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. ఆమె కూడా వైదొలుగు తున్నట్టుగా చెప్పలేదు. ఈనేపథ్యంలోనే కొద్ది రోజుల పాటు మాజీ మంత్రి, సింగరేణి కార్మికుడు అయినటువంటి కొప్పుల ఈశ్వర్ కు భాద్యతలు అప్పగించారు.

బుధవారం యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ కె పూర్తి భాద్యతలు అప్పగిస్తున్నట్టుగా పార్టీ ప్రకటించింది. అంపశయ్యపైనున్న యూనియన్ కు కొప్పుల ఈశ్వర్ ఆపద్బాంధవుడు అయినాడనే అభిప్రాయాలు సైతం సింగరేణి కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 26 ఏళ్ల పాటు సింగరేణి కార్మికుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అదే స్థాయిలో రాజకీయ పరంగా అపారమైన అనుభవం సైతం ఉంది. అధినేత కేసీఆర్ కొలత బద్దకు కొప్పుల ఈశ్వర్ సరిపోవడంతోనే గౌరవ అధ్యక్షుడిగా నియమించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
సింగరేణి విస్తరించిన ప్రాంతాల నుంచి ఆసిఫాబాద్ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఉన్నారు. అంతకు మించి బలం లేదు. ఎంపీలు లేరు. సింగరేణిలో ఏ ఒక్క ఏరియాకు కూడా ప్రతినిథ్య సంఘంగా లేదు. అదే విదంగా యూనియన్ కు అంగబలం తో పాటు ఆర్థిక బలం కూడా తోడైనది. ఇప్పుడు యూనియన్ కమిటీని ఏరియా స్థాయి నుంచి కేంద్ర కమిటీ వరకు పునర్నిర్మాణం చేపట్టాలి. కమిటీ ఏర్పాటు కూడా కొప్పుల ఈశ్వర్ కు కత్తిమీద సాములాంటిదే. సింగరేణిలో యూనియన్ బాధ్యతల్లో ఉన్నప్పుడు కూడా తన భాద్యతలను కాపాడుకోలేక పోయిందనే పేరు సంపాదించుకొంది. ఇన్ని సమస్యలను ఎదురీదుకుంటూ రాబోయే ఎన్నికల నాటికి యూనియన్ ను ఎలా బలోపేతం చేస్తారో ఆ ఈశ్వరుడికే తెలియాలంటున్నారు కార్మిక వర్గాలు.

by