హైదరాబాద్ లో లొంగిపోతున్న సంజీవ్ ?
సంజీవ్ కూడా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడే
పదికి పైగా భాషల్లో విప్లవ పాటలు రాసి పాడే గాయకుడు
1985 లో గాయకుడిగా అడవిబాట
వంగపండు, గద్దర్ తరువాత సాంస్కృతిక సారధిగా భాద్యతలు
Mavoist : మావోయిస్టు పార్టీ ఎదురుకాల్పులతో సతమతమవుతోంది అనుకుంటే తాజాగా లొంగుబాటు కూడా తలనొప్పిగా మారింది. ప్రతిరోజూ ఎవరో ఒకరు లొంగిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ఎన్కౌంటర్ లు, మరోవైపు లొంగుబాటు నేపథ్యంలో పార్టీని చక్కదిద్దే పరిస్థితి కేంద్ర కమిటీకి అందనంత దూరంలో ఉంది. తాజాగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, జననాట్య మండలి సాంస్కృతిక సారధి సంజీవ్ హైదరాబాద్ లో గురువారం లొంగిపోతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
రెండురోజుల కిందటనే పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న, అతని భార్య బస్టర్ కార్యదర్శి వనితక్క లొంగిపోయారు. తాజాగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, సాంస్కృతిక సారధి సంజీవ్ అలియాస్ లెంగు దాదా లొంగిపోతున్నాడు. సంజీవ్ లొంగిపోవడంతో పార్టీ గొంతు మూగబోయినట్టే అంటున్నారు పలువురు మాజీ మావోయిస్టులు.

హైదరాబాద్ కు చెందిన సంజీవ్ 1985 లో మావోయిస్టు పాటలకు ఆకర్షితుడై అడవిబాట పట్టాడు. వంగపండు, గద్దర్ లకు శిష్యుడిగా పేరుంది. తన ఇంటిపేరును JNM (జననాట్యమండలి ) గా మార్చుకున్నాడు సంజీవ్. చేతన నాట్యమండలి చీఫ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. మావోయిస్టు పార్టీ లో గద్దర్, వంగపండు తరువాత సంజీవ్ జననాట్యమండలి భాద్యతలు చేపట్టాడు. సంజీవ్ పదికి పైగా భాషల్లో విప్లవ గీతాలు రచించి, పాడగలడనే పేరుంది. వారం రోజుల కిందటనే లొంగిపోడానికి రహస్య ప్రాంతానికి చేరుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం సంజీవ్ వయసు 70 ఏళ్ళు. వయోభారం, అనారోగ్యం కారణాలతోనే లొంగిపోతున్నట్టుగా తెలిసింది. అతనిపై రూ : 50 లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం. ఎట్టకేలకు సంజీవ్ 40 ఏళ్ల అడవి బాటకు స్వస్తి పలికి ఇంటి బాట పట్టడం విశేషం.

by