Pooja : ఇంటి కుటుంబ సభ్యుడు చనిపోతే సంవత్సరం వరకు ఇంటిలో దేవుడికి పూజలు చేయరు. కనీసం దీపం కూడా వెలిగించరు. చాలామంది దేవుడి ఫోటోలను, దీపాలను, తీసివేసి కట్టిపెడుతారు. ఏడాది గడిచిన తరువాతనే ఇంటిలో తిరిగి పూజలు చేయడం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి చనిపోతే ఏడాది పాటు ఆ ఇంటిలో ఎలాంటి పూజలు ఉండవన్నమాట.
ఇంటిలో ఎవరైనా కుటుంబ సభ్యుడు చనిపోతే పూజలు చేయరాదని ఏ వేదంలో కూడా చెప్పలేదని పలువురు వేద పండితులు చెబుతున్నారు. దీపాలు వెలిగించకూడదని కూడా ఎక్కడ కూడా సూచించలేదు. దీపం అనేది శుభానికి ఒక సంకేతం. ఎక్కడైతే దేవుని విగ్రహాల వద్ద దీపం వెలిగిస్తామో అక్కడ దేవతలు నివసిస్తారని వేదంలో చెప్పబడింది.
కాబట్టి సంవత్సరం పాటు దేవుడి వద్ద దీపాలు వెలిగించకపోవడం వలన దోషం కిందకే వస్తుంది. వ్యక్తి చనిపోయిన తరువాత అతని కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన మరుసటి రోజు నుంచి దీపాలు వెలిగించి, పూజలు చేసుకోవచ్చని వేదాలు చెబుతున్నాయి. ప్రతి రోజు ఆలయానికి కూడా వెళ్ళవచ్చు. తీర్థ ప్రసాదాలు తీసుకోవడం వరకే పరిమితం కావాలి. కానీ గుడిలో నిర్వహించే మిగతా కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.