Home » Mavoist : మావోయిస్టు నిర్ణయం…హోంశాఖలో అనుమానం ?

Mavoist : మావోయిస్టు నిర్ణయం…హోంశాఖలో అనుమానం ?

అభయ్ ఫోటోతో ఉన్న లేఖ నిజమైనదేనా ?
ఫోటో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ?
పార్టీ పెద్దలతో చర్చించకుండానే లేఖ ఎలా తయారవుతుంది ?
చర్చలు విఫలమైతే, నెలరోజుల గడువు బలోపేతం కోసమేనా ?

Mavoist : మావోయిస్టు పార్టీని అంతమొందించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి రోజు, రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్నఎన్కౌంటర్లలో పార్టీ చీఫ్ తో పాటు ప్రధానంగా కేంద్ర కమిటీ సభ్యులే చిక్కుతున్నారు. అంతే కాదు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ప్రభుత్వానికి లొంగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం దాటికి తట్టుకోలేకనే మావోయిస్టు పార్టీ అభయ్ పేరుతొ ఒక లేఖ అయితే విడుదల అయ్యింది. ఆయుధాలను వదిలేస్తున్నాం. నెల రోజుల గడువు కావాలి. చర్చలకు ముందుకు వస్తున్నాం. అప్పటి వరకు కాల్పులను జరపరాదనేది లేఖ సారాంశం. అయితే మావోయిస్టు లేఖ పై కూడా అనేక అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి……

పది రోజుల కిందటనే గెరిల్లా యుద్ధం కొనసాగుతుంది అంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేరుతో ఒక లేఖ కూడా విడుదలైనది. తాజాగా కేంద్ర కమిటీ స్థానంలో ఉన్న అభయ్ పేరుతొ చర్చల లేఖ రావడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అభయ్ పేరుతొ వచ్చిన లేఖ వాస్తవమే అయితే నెల రోజుల పాటు ఎందుకు బయటకు రాలేదనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిన లేఖ లో ఇప్పటి వరకు నాయకుల ఫోటోను పెట్టలేదు. గణపతి నుంచి మొదలుకొని ప్రతి కీలక నేతల ఫోటోలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని నిఘా అధికారుల వద్ద ఉన్నవనే విషయం జరిగిన ఎన్కౌంటర్లే ఒక తార్కాణం. కాబట్టి లేఖ పై అభయ్ ఫోటో ఉండటం కూడా అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

నెలరోజుల్లో తాము జైల్లో ఉన్న నాయకులతో పాటు, పార్టీలో దూరంగా ఉన్న నాయకులతో కలిసి చర్చించిన అనంతరం చర్చలకు అనుకూలంగా ఉన్న వారిని చర్చల ప్రతినిధులుగా పంపుతామని లేఖలో అభయ్ పేర్కొన్నాడు. అంటే లేఖ నెలరోజుల కిందటనే తయారైన లేఖ వాస్తవమే అయితే రాసే ముందు కీలక నేతలతో చర్చించకుండానే అభయ్ పేరుతొ లేఖ ఎలా తయారవుతుందనే ప్రశ్నలు సైతం తలెత్తు తున్నాయి. జైలులో ఉన్న నాయకులకు లేఖ రాసే ముందు విషయం చెప్పడం పార్టీకి పెద్ద కష్టం కూడా కాదు. అభయ్ ఇతరులతో చర్చించకుండానే సొంతంగానే లేఖ పంపాడంటే పార్టీలో గ్రూప్ లు ఏర్పడినవా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. నెల రోజుల సమయం కోరడం సముచితమే. గతంలో కూడా ఉమ్మడి సీఎం రాజశేఖర్ రెడ్డి హయంలో కూడా చర్చలు జరిగాయి. అప్పుడు కూడా చర్చలు విఫలం కావడంతో ఆ సమయాన్ని బలోపేతానికి పార్టీ సద్వినియోగం చేసుకుంది. చర్చలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించనేలేదు, అప్పుడే ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని అభయ్ ప్రకటించడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

లేఖ వాస్తవమే అయితే మావోయిస్టు చర్చల సారాంశం అంత సులభంగా ఉండదు. అటవీ ప్రాంతాల్లో ఉన్న ప్రజల సమస్యలు, అటవీ హక్కులు, జైల్లో ఉన్న నేతల విడుదల, ఇప్పటి వరకు ఉన్న కేసుల ఎత్తివేత, అడవుల్లో ఉన్న ఖనిజ సంపద పై చర్చ ముందుకు వస్తుంది. ప్రధానంగా అడవుల్లో ఉన్న ఖనిజ సంపదపై చర్చలు సఫలం కావడం అంత సులభం కాదు. దింతో సమస్య తిరిగి మొదటికే వస్తుంది. నెలరోజుల పాటు ఆయుధాల్ని విరమిస్తామని, అదే విదంగా కాల్పులకు ప్రభుత్వం కూడా దూరంగా ఉండాలని అభయ్ కోరాడు. అంటే చర్చలు ఒకవేళ విఫలం అయితే ఈ నెల రోజుల సమయాన్ని పార్టీ సద్వినియోగం చేసుకుంటుంది. ఆయుధ సంపదతో పాటు, నియామకాలను కూడా పూర్తి చేసుకుంటుంది. వీటి కోసమే నెల రోజుల గడువు కోరుతున్నట్టుగా కూడా కేంద్ర హోం శాఖా వర్గాల్లో అనుమానాలు వ్యక్తం కావడం విశేషం. మధ్యవర్తుల్లో ఎవరైనా ముందుకు వచ్చి లేఖ వాస్తవమే అంటూ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే అనే అభిప్రాయాలు సైతం ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ లేఖ అవాస్తవమైతే సృష్టించాల్సిన అవసరం ఎవరికి ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం కావడం విశేషం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *