MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత …జాగృతి అధ్యక్షురాలు. తెలంగాణ ఉద్యమ నాయకురాలు. అంతే కాదు ఉద్యమ నేత కేసీఆర్ కూతురు. పార్టీలో ఎలాంటి పదవులు లేవు. కానీ పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు. వెరసి కుటుంబంతో విభేదం. ఈ విభేదం బయటకు అంటే మీడియా కు రాజకీయంగా మాత్రమే కనబడుతోంది. అధికార పార్టీ పై ఆమె బిఆర్ఎస్ కంటే ఎక్కువగానే దూకుడు మీద ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. తాజాగా సింగరేణిలో హెచ్ఎంఎస్ తో పొత్తు. ఇక్కడే సింగరేణి కార్మికులకు పెద్ద అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని కార్మికులు బొగ్గు బాయిల మీద బహిరంగానే చర్చించుకుంటున్నారు.
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవిత కొనసాగుతున్న నేపథ్యంలోనే విభేదాలు బయటకు పొక్కాయి. ఇంతలోనే కేటీఆర్ యూనియన్ భాద్యతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అప్పగించారు. ఈశ్వర్ కు భాద్యతలు అప్పగించే సమయంలో కవితను యూనియన్ ను తొలగిస్తున్నట్టుగాని, బహిష్కరిస్తున్నట్టు గాని కేటీఆర్ ప్రకటించలేదు. ఆమెకూడా యూనియన్ కు రాజీనామా చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా ప్రకటించ లేదు. అంతే కాదు పార్టీ కూడా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఆమెపై తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కవిత టీబీజీకేఎస్ లో ఉన్నట్టా ? లేనట్టా ? సమాధానం చెప్పాలంటున్నారు కార్మికులు
తాజాగా ఆమె సింగరేణిలో హెచ్ఎంఎస్ తో పొత్తు పెట్టుకున్నట్టుగా ప్రకటించారు. దసరా అనంతరం ఆమె గనులపై పర్యటించ నున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె ఏ హోదాలో సింగరేణిలో పర్యటిస్తారు అనే ప్రశ్నలు కార్మిక వర్గాల్లో వ్యక్తమవు తున్నాయి. అంతే కాదు హెచ్ఎంఎస్ కూడా సింగరేణిలో కవిత ఆశించినంత బలంగా లేదు. గతంలో ఆ యూనియన్ కు RG -1, 2, 3 ఏరియాల్లో పట్టు ఉండేది. ఇప్పుడు ఆ పట్టు కూడా కోల్పోయింది హెచ్ఎంఎస్. పట్టు ఉన్నప్పుడే మాజీ మంత్రి వేణుగోపాల చారి, మాజీ మంత్రి బోడ జనార్దన్ లు హెచ్ఎంఎస్ లో చేరి, బయటకు రావడం జరిగింది. ఇప్పుడు కవిత యూనియన్ అదినేత రియాజ్ అహ్మద్ తో కలిసి నడుస్తారా ? లేదంటే ఆ ఇద్దరి మాదిరిగానే బయటకు వస్తారా ? అనే అనుమానాలు సైతం కార్మిక వర్గంలో వ్యక్తం కావడం విశేషం.