Politics : ప్రజల అభివృద్ధిని కోరుకునే రాజకీయ పార్టీలను ప్రజలు విశ్వసిస్తరు. అదే విదంగా ప్రజల చేత చట్ట సభలకు ఎన్నుకోబడిన నాయకులకు కూడా చట్ట సభలపై విశ్వాసం ఉండాలి. కానీ నేటి రాజకీయ నాయకులకు చట్టసభలు అంటేనే వారి దృష్టిలో చులకన భావం ఏర్పడింది. చట్టసభలపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్న నాయకులపై కూడా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం అసెంబ్లీలో చర్చ పెడదామంటే, కేటీఆర్ ప్రెస్ క్లబ్ అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీలో అడుగుపెడుతానంటున్నారు వై ఎస్ జగన్. ఇదెక్కడి విచిత్రమో. అసెంబ్లీ అంటే అంత చులకన ఏర్పడింది రెండు రాష్ట్రాల విపక్ష నేతలకు.
అసెంబ్లీని సమావేశపరుస్తాం. గవర్నర్ అనుమతితో ఏర్పాటు చేస్తామని, ప్రతిపక్ష నేతగా మీ సలహాలు, మీ అనుభవాన్ని స్వీకరిస్తామని కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందుకు విరుద్దంగా కేటీఆర్ స్పందిస్తూ కేసీఆర్ తో చర్చించే స్థాయి నీది కాదు. నేను సరిపోతాను, చర్చ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేశానని కేటీఆర్ అంటున్నారు. ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల సమస్యలపై చర్చించడానికి దేవాలయం లాంటి అసెంబ్లీని కాదని ప్రెస్ క్లబ్ లో చర్చలు ఏమిటని రాష్ట్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో మరో విచిత్రం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ వస్తా అంటున్నారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. ప్రస్తుతం అయన ఎమ్మెల్యే హోదాలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే హోదాలో ఆయన సభకు వచ్చి తన నియోజక వర్గం ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తే ఆ నియోజక వర్గం ప్రజలు హర్షించేవారు. ఎమ్మెల్యే గా కూడా ఆయన చట్టసభకు గౌరవం ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గల్లో వ్యక్తమవుతున్నాయి.
చట్ట సభలో ప్రతిపక్ష నాయకుల గొంతు వినపడరాదు. ఏమి చేయాలి. ఏ ఒక్కరిని వదల కుండా కేసీఆర్ తన కండువా కప్పుకున్నారు. నరనరాల్లో పసుపు రక్తం కలిసిపోయిన వారిని వదిలిపెట్టలేదు. పదేళ్లు ఎన్నో పదవులు పొందిన ఖద్దరు నేతలను వదలలేదు. ఎర్ర జెండా కప్పుకొనే తుదిశ్వాస విడుస్తామనే వారిని సైతం కేసీఆర్ వదిలిపెట్టలేదు. మొండిగా పట్టుదలతో ఉన్నవారు ఎవరైనా ఉంటె వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడితే సస్పెండ్ అనే పదం కోసం రాజ్యాంగమనే గ్రంథంలో వెతికేవారు.
ఏపీ లో ఐదేళ్లు పరిపాలించిన జగన్ మోహన్ రెడ్డి చట్ట సభను కౌరవ సభలా మార్చేశారు. సభలో మహిళలు అనే గౌరవం లేకుండా చులకనగా మాట్లాడిన సందర్భాలు సైతం అనేకంగా ఉన్నవి. ముఖ్యమంత్రి నుంచి మొదలు కొని ఎమ్మెల్యేల వరకు అసెంబ్లీలో చేసిన వెకిలి చేష్టలను రాష్ట్ర ప్రజలు గమనించి ముక్కున వేలేసుకున్నారు.
ప్రజలని పట్టించుకోకుండా, వాళ్ళ ఓట్లతో గెలిచి ప్రజాస్వామ్య విలువలకు పాతరేసిన నాయకులను ఐదేళ్ల కోసారి శిక్షిస్తారు ప్రజలు. ఇందుకు తార్కాణం తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోవడం, ఏపీ లో 151 స్థానాల నుంచి 11 తో సరిపెట్టుకోవాలని ప్రజలు తీర్పు చెప్పడం. దేవాలయాల్లాంటి చట్టసభలను గౌరవించని నాయకులు ప్రజాస్వామ్య దేశంలో మనుగడ సాగించలేరు. అర్హత కూడా పొందలేరు.