Home » కాసిపేట గనిలో సంబరాలు

కాసిపేట గనిలో సంబరాలు

తాడిచర్ల-2 బ్లాక్ సింగరేణికి కేటాయింపు
మిఠాయిల పంపిణీ చేసిన యాజమాన్యం, ఉద్యోగులు
తాడిచర్ల-2తో సింగరేణికి దీర్ఘకాల ప్రయోజనాలు

కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి):

తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించిన సందర్భంగా బెల్లంపల్లి రీజియన్ మందమర్రి ఏరియాలోని కాసిపేట-1 ఇంక్లైన్ గనిలో యాజమాన్యం, ఉద్యోగులు కలిసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గని అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడుతూ, కార్మిక సంఘాల కృషి, ఉద్యోగుల నిరంతర పోరాటాల ఫలితంగానే తాడిచర్ల-2 బ్లాక్ సింగరేణికి కేటాయింపు జరిగిందన్నారు. సింగరేణి వ్యాప్తంగ మిగిలిన బొగ్గు గనులను కూడా సంస్థకే కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

ముఖ్య అతిథిగా హాజరైన గని మేనేజర్ సతీష్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాడిచర్ల-2 బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడం సంస్థ భవిష్యత్తుకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఇది సింగరేణిలోనే అతిపెద్ద బొగ్గు బ్లాక్‌గా నిలుస్తుందని తెలిపారు. ఈ బ్లాక్‌లో సుమారు 434 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, వాటిలో 300 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును వెలికితీసే అవకాశం ఉందన్నారు. సంవత్సరానికి సుమారు 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని, ఈ గని సుమారు 45 సంవత్సరాల పాటు సింగరేణికి ఉపాధి, ఉత్పత్తి పరంగా అండగా నిలుస్తుందని వివరించారు. ఈ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శి మీనుగు లక్ష్మీనారాయణ, రక్షణాధికారి సురేష్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సర్వేయర్ ప్రభాకర్, ఇంజినీర్లు శ్రీనివాస్, రామకృష్ణ, రవీందర్, సంక్షేమాధికారి మీర్జా గౌస్ జీషాన్‌తో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *