అవస్థ పడుతున్న వ్యాపారస్తులు
కలుషితమవుతున్న సరుకులు
మార్కెట్ కమిటీ చైర్మన్ కొరివి నరసింహులు
కోల్ బెల్ట్ న్యూస్ (దోమకొండ):
దోమకొండ మండల కేంద్రంలోని వారపు సంతలో రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను వెంటనే కల్పించాలని జిల్లా కమిటీ అధ్యక్షుడు కొరివి నరసింహులు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.మంగళవారం దోమకొండ వారపు సంతను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో మార్కెట్ ప్రాంగణంలో నీరు నిల్వ ఉండడం, ఎండాకాలంలో దుమ్ము అధికంగా ఎగసిపడటం వల్ల కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని, క్యాన్సర్ సహా పలు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మార్కెట్ పరిస్థితులను పరిశీలించినట్లు తెలిపారు. వెంటనే మార్కెట్‌లో పరిశుభ్రత చర్యలు చేపట్టి, రేకుల షెడ్లు, సిమెంట్ ప్లాట్‌ఫామ్‌లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. దోమకొండతో పాటు జిల్లాలోని అన్ని మండలాల వారపు సంతల్లో ఇదే తరహా సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే గ్రామాలు, మార్కెట్లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. రైతులు తమ పంటలను పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయించేలా ప్రభుత్వం తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
దోమకొండ వారపు సంతలో ప్రతి వారం సుమారు రూ.4 లక్షల వరకు వ్యాపారం జరుగుతుండగా, రోజువారీగా రూ.2 లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామపంచాయతీ, దేవాలయ కమిటీకి కూడా ఈ మార్కెట్ ద్వారా ఆదాయం లభిస్తున్నందున, రైతులు మరియు వ్యాపారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

by