Kavitha : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గులాబీ బాట విడిచి, సొంత బాట ఎంచుకున్నారు. అప్పటి నుంచి నిత్యం ఎదో ఒక కార్యక్రమాన్ని ఎంచుకుంటున్నారు. జాగృతి పేరుతొ జనం బాట పట్టారు. ఒకవైపు ప్రజలతో మాట్లాడుతూనే, మరోవైపు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బిఆర్ఎస్ పరిపాలనలో అవినీతి జరిగిందని దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రధానంగా హరీష్ రావు ను లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అప్పుడప్పుడు కేటీఆర్ ను కూడా వదిలిపెట్టడంలేదు. కవిత ఆరోపణలకు హరీష్ రావు, కేటీఆర్ సమాధానం ఇవ్వకుండా దూరంగా ఉండటం విశేషం.
అయితే ఇటీవల కవిత కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఆమెకు ప్రభుత్వంలో మంత్రి పదవి ఖాయం. అంతే కాదు ఆమె చేరికను కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆమోదం తెలిపాడంటూ పలు సోషల్ మీడియాలో కథనాలు రావడం కూడా జరిగింది. ఈ కథనాలతో కాంగ్రెస్ తో పాటు గులాబీ గూటిలో సైతం ప్రకంపనలు మొదలైనాయి. వీటన్నిటిని కవిత ఖండిస్తూ నేరుగా కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు గురిపెట్టారు.
మహేషన్నా ….నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నేనే పార్టీ పెడుతున్నాను. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతోంది. నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాను. మీరే నా పార్టీలో చేరండి. మీకు నా పార్టీలో మంచి పోస్ట్ ఇస్తాను అంటూ కవిత సెలవివ్వడం విశేషం.

by