Home » Singareni : 22న సింగరేణిలో TNTUC నిరాహార దీక్ష

Singareni : 22న సింగరేణిలో TNTUC నిరాహార దీక్ష

Singareni : 2024-2025 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బొగ్గు గని కార్మికులు సాధించిన లాభాల వాటాను చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని TNTUC అధ్యక్షుడు పెద్దపల్లి సత్యనారాయణ ఆరోపించారు. గురువారం ఆయన గోదావరిఖని యూనియన్ కార్యాలయంలో మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 22న ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నామన్నారు. ఈ దీక్షను రామగుండం రీజియన్ లోని RG -1 ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్నామన్నారు. TNTUC
యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ దీక్షకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా పెద్దపల్లి సత్యనారాయణ ఈ సందర్బంగా కోరారు.

AITUC నేత గట్టయ్య డిమాండ్ మేరకు కార్మికులు సాధించిన లాభాల వాటాను పంపిణీ చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించడం జరిగిందని సత్యనారాయణ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇదే ఆనవాయితీగా లాభాల వాటా ప్రకటన, లాభాలలో కార్మికులకు ఇచ్చే వాటాను ముందే ప్రకటించి యాజమాన్యం పంపిణీ చేసేదని ఆయన వివరించారు. ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరునెలలు గడిచినప్పటికీ యాజమాన్యం నుంచి చెల్లింపుల విషయంలో స్పందన లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సింగరేణిలో సాంకేతిక నైపుణ్యాలు పెరిగినప్పటికీ లాభాలను ప్రకటించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. యాజమాన్యం ఇదే నెల 20న లాభాలను ప్రకటించాలని, లేనిచో యూనియన్ నిర్ణయం మేరకు సెప్టెంబర్ 22న ఒకరోజు దీక్ష కార్మికుల ఆధ్వర్యంలో చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. ఆయనతో పాటు TNTUC నాయకులు కోటగిరి పాపయ్య, సంగేపు రాజు, చిటికెల రాజలింగం, గుండ బోయిన ఓదెలు యాదవ్, కోడిపెల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *