Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బాధ్యతల గురించి అటు కాంగ్రెస్ తో పాటు బిజెపి లో కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఇటీవల ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారం రేపాయి. 75 ఏళ్ళు నిండిన రాజకీయ నాయకులు ఎవరైనా సరే పదవీ విరమణ పొందాల్సిందేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. మోదీ కి 75 ఏళ్ళు నిండనున్నాయి. కాబట్టి మోదీ ని దృష్టిలో పెట్టుకొనే RSS చీఫ్ అలా మాట్లాడి ఉంటారని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది.
ఇటీవల నాగపూర్ లో ఒక కార్యక్రమానికి మోహన్ భగవత్ హాజరైనారు. 75 ఏళ్ల శాలువా మన భుజాలమీద కప్పారంటే, వాళ్ళు ఒక నిర్దిష్ట వయస్సుకు చేరుకున్నట్టుగా భావించాలని ఆ శాలువా వెనుక దాగి ఉన్న అర్థం అంటూ మాట్లాడారు. అంటే మనం పక్కకు తప్పుకొని, ఇంకొకరికి ఆ భాద్యతలు అప్పగించాలని ఆ శాలువా అర్థం అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి తెరలేపాయి.
బీజేపీ లో మోదీ , అమిత్ షా ఎప్పుడైతే పట్టు సాధించారో అప్పుడే రిటైర్మెంట్ తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎల్కే అద్వానీ, వెంకయ్య నాయుడుతో పాటు మరి కొందరిని రిటైర్మెంట్ సాకుతో పక్కకు పెట్టారు. కానీ అదే సమయంలో రాజకీయ అవసరాల కోసం 75 ఏళ్ళు దాటినా యడ్యూరప్పను కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదికి 75 ఏళ్ళు నిండుతాయి. ఈ విషయాన్ని మోహన్ భగవత్ చెప్పకనే చెప్పేశారు. అంతే కాదు మోహన్ భగవత్ కు కూడా ఇదే ఏడాది సెప్టెంబర్ 11 నాటికి 75 ఏళ్ళు నిండుతాయి. ఇద్దరి రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమైనది. సంఘ్ పరివార్ లో రిటైర్మెంట్ నిబంధన అమలవుతుంది. కానీ మోదీ కి యడ్యూరప్ప నిబంధన వర్తిస్తుందో లేదో వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పండితులు.