BRS : బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. అందులో బిఆర్ఎస్ కు పరువు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. సిట్టింగ్ స్థానం కాపాడుకోకుంటే జంట నగరాల్లో పార్టీ క్యాడర్ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలి. సానుభూతి దక్కించుకోవాలి. సానుభూతి పవనాల్లో ఓటమిపాలైతే పార్టీ క్యాడర్ దూరం అవుతుందనేది జగమెరిగిన సత్యం.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో గులాబీ అభ్యర్థి మూడో స్థానాన్ని సరిపెట్టుకున్నారు. అక్కడ చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబానికి టికెట్ ఇచ్చినా సానుభూతి చూపలేదు ఓటర్లు. రాబోయే జూబ్లీహిల్స్ లో అదే పరిస్థితి ఏర్పడితే పార్టీ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటదో చెప్పాల్సిన పనిలేదు.
2014 లో గోపినాథ్ టీడీపీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచే గెలిచారు. ఆ తరువాత రెండు సార్లు బిఆర్ఎస్ అభ్యర్థిగా అక్కడి నుంచే గెలిచారు. వరుసగా రెండు సార్లు గెలువడంలో ఆ స్థానంలో మజ్లీస్ పోటీలో ఉండకుండా బిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు మజ్లీస్ కాంగ్రెస్ అడుగుజాడల్లో నడుస్తోంది. కాబట్టి రాబోయే ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మజ్లీస్ మద్దతు ఉంటుంది. ఇకపోతే ఒకవేళ కూటమి అభ్యర్థి బరిలో ఉంటె బీజేపీ మద్దతు కూటమికే ఉంటుంది. లేదంటే బీజేపీ సొంతంగా గట్టి పోటీనే ఇస్తుంది.
కంటోన్మెంట్ తోనే సానుభూతి పవనాలు ఎటు విస్తాయో అనేది తేలిపోయింది. బీజేపీ దగ్గరకు రాదు. మజ్లీస్ దూరం అయ్యింది. ఒంటరి పోరాటంతో బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలంటే కష్టాన్ని నమ్ముకోవాల్సిందే అంటున్నారు రాజకీయ శ్రేణులు.