Theenmar Mallanna : తీన్మార్ మల్లన్న అంటే ఆయన తెలంగాణ లో ఒక సీనియర్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ గా ఆయన ప్రజలకు సుపరిచితుడు. పలు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. తనదయిన శైలిలో వార్తలు అందిస్తూ ప్రజలకు చేరువయ్యారు. జర్నలిస్ట్ బాధ్యతల నుంచి తప్పుకొని సొంతంగా క్యూ న్యూస్ ఛానల్ ప్రారంభించారు. ఒకవైపు మీడియా అధిపతిగా పనిచేస్తూనే, మరోవైపు రాజకీయాలలోకి కాలుపెట్టారు మల్లన్న. కేసీఆర్ ప్రభుత్వం పై తన కలానికి ఉన్న బలమేంటో చూపించారు. ఈ నేపథ్యంలో ఆయనపై కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన పోలీస్ కేసులకు లెక్కేలేదు.
తెలంగాణ శాసన మండలికి 2015 లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత అదేస్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా 2021 మార్చిలో పోటీచేశారు. ప్రధాన పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. ఒక దశలో మల్లన్న విజయం ఖాయమనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. రెండో స్థానం సాధించి ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. 2021 డిసెంబర్ లో కాషాయం కండువా కప్పుకున్నారు. మల్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మల్లన్న పై రాజకీయ వర్గాల్లో కొంత అసంతృప్తి వచ్చింది. పార్టీల కండువాలు మార్చడంతో నిలకడలేని నాయకుడిగా అభిప్రాయాలు వ్యక్తం కావడం విశేషం. జర్నలిస్ట్ గ కఠిన నిర్ణయాలు తీసుకునే మల్లన్న , రాజకీయ కండువాలు కప్పుకునే విధానంలో ఖచ్చితంగా ఉండకపోవడం పై ప్రజల్లో కొంత అసంతృప్తి ఏర్పడింది. మల్లన్న చేపట్టిన పాదయాత్ర కూడ ప్రజల్లో నాటుకొంది.
ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తాజాగా బరిలో దిగారు. ఆయనను ఓడించడానికి బీజేపీ కంటే గులాబీ పార్టీనే ఎక్కువ కసితో ఉంది. ఈ ఎన్నికలో మల్లన్న గెలుపు భాద్యత కాంగ్రెస్ భుజాలపై పడింది. 2021 లో సాధించిన మెజార్టీ కి అదనపు ఓట్లు తెచ్చుకోవడమే మల్లన్నకు మిగిలింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అదే అభిమానంతో పట్టభద్రులు మల్లన్న వెంట నడిస్తే విజయం సాధ్యమే అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై కూడా మల్లన్న గెలుపు ఆధారపడి ఉంది. మల్లన్న మూడోసారి గెలిచి తన ముచ్చట తీర్చుకోవాలని ఆశతో ఉన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని నీడలా వెంటాడుతూ ప్రభుత్వ పనితీరును వెంట,వెంట ఎండగట్టారు మల్లన్న. మల్లన్న ఆశలను అడియాశలు చేయాలని కేసీఆర్ గులాబీ దళం కసిగా ఉంది. మల్లన్న ముచ్చట తీరుతుందా ??? లేదంటే గులాబీ బాస్ కోరిక తీరుతుందా వేచిచూడాల్సిందే.