ఆ ప్రభుత్వ పాఠశాలలో చేరితే…
ఇంటి పన్ను – నల్లా పన్ను మాఫీ!
మైసంపల్లి గ్రామపంచాయతీ వినూత్న నిర్ణయం
ప్రభుత్వ బడిలో చేరిన విద్యార్థుల కుటుంబాలకు ప్రత్యేక రాయితీలు
కోల్ బెల్ట్ న్యూస్(వరంగల్) :
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తూ, గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రామ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఈ మేరకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కుటుంబాలకు ఇంటి పన్ను, నల్లా పన్నుల నుంచి పూర్తి మినహాయింపు కల్పించనున్నట్లు గ్రామ సర్పంచ్ ఇంద్రదేవ్ ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కూడా అలాంటి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో సర్కారు బడులను పరిరక్షించాలనే ఉద్దేశంతో గ్రామస్థుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సర్పంచ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి, విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు.
గ్రామపంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయం విద్యా రంగంలో చర్చనీయాంశంగా మారగా, ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మైసంపల్లి గ్రామపంచాయతీ చేపట్టిన ఈ చర్యను స్థానిక ప్రజలు స్వాగతిస్తున్నారు.

by