సింగరేణి బొగ్గు వివాదం
కిషన్ రెడ్డి లేఖ వెనుక రాజకీయ వ్యూహమా ?
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల) :
సింగరేణి కాలరీస్ సంస్థలో భారీ కుంభకోణం జరిగిందంటూ వెలువడుతున్న కథనాల నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యమైందన్న ఆరోపణలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కిషన్ రెడ్డి లేఖ రాయడంలో తప్పు లేదు. కానీ ఆయన లేఖ రాసిన విధానం ఎలా ఉందంటే ” చంకలో పసిబిడ్డను పెట్టుకొని ఊరంతా వెదికినట్టు ” అనే సామెతను గుర్తు చేస్తోంది.
సింగరేణి అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్య సంస్థ అని గుర్తు చేసిన కిషన్ రెడ్డి, బొగ్గు అదృశ్యం ఆరోపణలపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలికితీయాలని కోరారు. ఈ వ్యవహారంలో బాధ్యులెవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేయడం విశేషం.

అయితే ఈ లేఖ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. దేశ బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి స్వయంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ దర్యాప్తు, పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించి ఈ ఆరోపణలపై వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఆయన నేరుగా చర్యలకు దిగకుండా ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడాన్ని కొందరు రాజకీయ వ్యూహంగా విశ్లేషిస్తున్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉండటం కూడా ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తోంది.
తన లేఖలో కిషన్ రెడ్డి సింగరేణి ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిని కూడా ప్రస్తావించడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.51,500 కోట్లకు చేరుకున్నాయని, దీంతో సంస్థపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి నెలకొంటోందని తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.1,600 కోట్ల విలువైన బొగ్గు మాయమైందన్న ఆరోపణలు సంస్థ ఆర్థిక స్థిరత్వం, విశ్వసనీయతపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అదేవిధంగా, సింగరేణిలో ప్రస్తుతం అమలులో ఉన్న అంతర్గత నియంత్రణ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాల పనితీరును సమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, ఉన్నతాధికారులతో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ప్రతిపాదించారు. సుమారు 40 వేల మంది కార్మికులు, వారి కుటుంబాల జీవనాధారమైన సింగరేణి అభివృద్ధి, పారదర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.
ఇదిలా ఉండగా, కిషన్ రెడ్డి వైఖరిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేతగా ఉన్నప్పటికీ ఆయన బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష రాజకీయాలకు బలం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా బొగ్గు మాయం అంశంపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, రాసిన లేఖ కూడా అదే విమర్శలకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, సింగరేణిలో బొగ్గు అదృశ్యమైందన్న ఆరోపణలు కేవలం పరిపాలనా లేదా ఆర్థిక అంశంగా కాకుండా తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తాయన్నది వేచిచూడాల్సిందే.

by