Home » మెడికల్ బోర్డు అక్రమాలపై శాంతిఖని గనిలో కార్మికుల ధర్నా

మెడికల్ బోర్డు అక్రమాలపై శాంతిఖని గనిలో కార్మికుల ధర్నా

పారదర్శకంగా మెడికల్ బోర్డులు నిర్వహించాలి
సింగరేణి మనుగడకు రాజకీయాలకు అతీతంగా పోరాడాలి
ఏఐటీయూసీ నాయకుడు మిట్టపల్లి వెంకటస్వామి

కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):

సింగరేణి శాంతిఖని గనిపై మంతెన రమేష్ అధ్యక్షతన శనివారం కార్మికులు ధర్నా నిర్వహించారు. జూలై 17, 18 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డులో కార్మికులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి కార్మిక నాయకుడు మిట్టపల్లి వెంకటస్వామి మాట్లాడుతూ, 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కార్మికుల శ్రమను దోపిడీ చేసే విధానాలు అమలవుతున్నాయని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించాయని ఆరోపించారు.

గత 17 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకుండా కాలయాపన చేసి కార్మికుల హక్కులను కాలరాశారని, జూలై 17, 18 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డులో పారదర్శకత పాటించకుండా కేవలం 24 మందికే మెడికల్ ఇన్వాలిడేషన్ మంజూరు చేయడం వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించి, అర్హులైన కార్మికులకు మెడికల్ ఇన్వాలిడేషన్ కల్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సింగరేణికి తాడిచెర్ల-2 బొగ్గు గనిని అప్పగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కృషిని ఆయన అభినందించారు. అలాగే సర్వే పూర్తయిన 15 కొత్త బొగ్గు గనులను కూడా సింగరేణికే కేటాయించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సింగరేణి సమ్మె నోటీసులో పొందుపరిచిన అన్ని డిమాండ్లను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని, పారిశ్రామిక సంబంధాలను పరిరక్షిస్తూ సంస్థ అభివృద్ధికి అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

సింగరేణి యువ కార్మికులు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని, రాజకీయ విభేదాలకు అతీతంగా సంస్థ మనుగడ, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే ఉద్యమాల్లో ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని ట్రేడ్ యూనియన్లు ప్రపంచ కార్మిక వర్గ స్ఫూర్తితో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ప్రచార కార్యదర్శి మంతెన రమేష్, ఫిట్ కార్యదర్శి రత్నం ప్రవీణ్, సహాయ కార్యదర్శి దాడి రమేష్, సీనియర్ నాయకుడు రత్నం ఐలయ్య, మైన్స్ కమిటీ సభ్యులు, సేఫ్టీ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ, క్యాంటీన్ కమిటీ ప్రతినిధులు, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *