Telangana TDP : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏపీ సీఎం గా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రెండు దఫాలుగా తెలంగాణ నాయకులుతో సమావేశం నిర్వహించారు. తాజాగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.
హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ మాజీ మంత్రి బాబు మోహన్ చంద్రబాబును కలిశారు. బాబూమోహన్ పచ్చ చొక్కా ధరించి రావడం ఆకట్టుకొంది. రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు అనుచరులతో కూడా మంతనాలు జరుపుతున్నారని సమాచారం. ఇద్దరు కూడా ఏకంగా రాష్ట్ర అధ్యక్ష భాద్యతలనే కావాలంటున్నారు. ఒకరైతే ఏకంగా ఏపీకి చెందిన యనమల రామకృష్ణుడి ద్వారా అధ్యక్ష పదవి కోసం చంద్రబాబుకు చెప్పించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరిలో ఒకరు పార్టీ పదవి ఇవ్వకపోయినా పరవాలేదు. కానీ పార్టీలో చేరడం మాత్రం ఖాయమని తెలిసింది. అందుకు ముహూర్తం కూడా ఖరారు అయినట్టు సమాచారం.
ఒక్క ఎమ్మెల్యే చేరడం కాదు, రాష్ట్రానికి చెందిన కొందరు సీనియర్ నాయకులు కూడా ముహూర్తం సిద్ధం చేసుకున్నట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కొత్త అధ్యక్షుడి పైననే ఉంది. ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అధ్యక్ష భాద్యతలు కత్తిమీది సామే అవుతుంది. పార్టీ ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే శక్తిమంతుడే అధ్యక్షుడిగా వస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష నియామకం తరువాత టీడీపీలో చంద్రబాబు సమక్షములోనే భారీగా చేరికలు ఉంటాయని పార్టీవర్గాల సమాచారం.