తెలంగాణ బ్రేక్ఫాస్ట్ పథకానికి రూ.61.44 కోట్ల ఆర్థిక సహకారం
9 ప్రాంతాల్లో అత్యాధునిక కేంద్రీకృత వంటశాలల ఏర్పాటు
8 వేల పాఠశాలల్లో 4 లక్షల మందికి పైగా విద్యార్థులకు నిత్యం పౌష్టిక అల్పాహారం
గ్రామీణ విద్యాభివృద్ధికి సింగరేణి బృహత్తర సేవ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
విద్యార్థులు ఆకలి బాధను మరచి, ఏకాగ్రతతో చదువుపై దృష్టి సారించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బ్రేక్ఫాస్ట్ పథకానికి సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యతలో భాగంగా భారీ ఆర్థిక సహకారం అందిస్తోంది. ప్రభుత్వ సంకల్పానికి తోడుగా నిలుస్తూ ఏకంగా రూ.61.44 కోట్లను కేటాయించి, రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో అత్యాధునిక కేంద్రీకృత వంటశాలల (సెంట్రలైజ్డ్ కిచెన్లు) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ వంటశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టిక అల్పాహారం అందించనున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విద్యార్థుల ఆకలి చదువుకు అడ్డంకి కాకూడదనే గొప్ప ఆశయంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వహణలో సింగరేణి పరిధిలోని ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తూ ఈ వంటశాలలను నిర్మిస్తున్నారు.
అనంతరం మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లోనూ కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేశారు. వీటి నిర్మాణానికి సింగరేణి సంస్థ రూ.21.03 కోట్లను సీఎస్ఆర్ నిధుల నుంచి మంజూరు చేసింది. అదేవిధంగా కొత్తగూడెం, సింగరేణి ఖమ్మం ప్రాంతం, భూపాలపల్లి, కాగజ్నగర్, మునగాల ప్రాంతాల్లో త్వరలో నిర్మించనున్న వంటశాలల కోసం మరో రూ.38.41 కోట్లను కేటాయించింది.
జిల్లాల వారీగా వంటశాలల వివరాలు
సింగరేణి సంస్థ ఏర్పాటు చేస్తున్న తొమ్మిది కేంద్రీకృత వంటశాలల పరిధిలో సుమారు 8 వేల పాఠశాలలు ఉండగా, నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. జిల్లాల వారీగా వంటశాలల వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం కేంద్రంగా 23 మండలాల పరిధిలోని 1,310 పాఠశాలలకు అల్పాహారం అందించేందుకు రూ.8.75 కోట్ల వ్యయంతో కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేస్తున్నారు. హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల పరిధిలోని 1,029 పాఠశాలలకు ఆహారం సరఫరా చేసేందుకు రూ.9.61 కోట్లతో వంటశాల నిర్మిస్తున్నారు. 16 మండలాల పరిధిలోని 879 పాఠశాలలను అనుసంధానిస్తూ రూ.7.53 కోట్లతో ఏర్పాటు చేసిన కేంద్రీకృత వంటశాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన, విద్యావంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 11 మండలాల పరిధిలోని 639 పాఠశాలలకు అల్పాహారం అందించేందుకు రూ.8.96 కోట్లతో అత్యాధునిక వంటశాలను ఏర్పాటు చేయనున్నారు.
విద్యాభివృద్ధికి సింగరేణి మరో ముందడుగు
ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సీఎస్ఆర్ నిధులను వెచ్చిస్తూ వస్తున్న సింగరేణి సంస్థ, ఇప్పుడు విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తోంది. పేద విద్యార్థుల ఆకలి తీర్చడంతో పాటు వారి విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్న ఈ కార్యక్రమంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి సంస్థకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});