కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామంలో శుక్రవారం ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ (బాల్య వివాహ రహిత భారత్) కార్యక్రమం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండని బాలికలకు, 21 ఏళ్లు నిండని బాలురకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. బాల్య వివాహాల కారణంగా చిన్నారుల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వారి విద్య, భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గ్రామంలో ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసినా, అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నా వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా అత్యవసర సహాయ నంబర్ 112కు సమాచారం అందించాలని కోరారు. అనంతరం గ్రామస్తులు, మహిళలు, యువతతో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});