కోల్ బెల్ట్ న్యూస్(ఇందల్వాయి):
హెచ్ఐవీ బాధితులు, వారి కుటుంబ సభ్యుల పట్ల ఎవరూ వివక్షత చూపించకూడదని వైఆర్జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీమ్ డీఆర్పీ సుధాకర్ సూచించారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో వైఆర్జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.హెచ్ఐవీ బాధితుల్లో పౌష్టికాహార లోపం కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. అందువల్ల వారికి సమయానికి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మరణాల ముప్పును తగ్గించవచ్చని వివరించారు. హెచ్ఐవీ బాధితుల పట్ల ఇళ్లు, ఆసుపత్రులు, బహిరంగ ప్రదేశాలు, కుటుంబాల్లో వివక్షత చూపించడం హెచ్ఐవీ చట్టం-2017 ప్రకారం శిక్షార్హమని పేర్కొన్నారు. వారసత్వ ఆస్తులకు సంబంధించిన సమస్యలు ఎదురైతే న్యాయ సేవాధికార సంస్థ సహాయం తీసుకొని పరిష్కరించుకోవచ్చని సూచించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హెచ్ఐవీ బాధితులు భయాందోళనలకు గురికాకుండా క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వినియోగించాలని సుధాకర్ సూచించారు. మందులను సకాలంలో తీసుకోవడం వల్ల శరీరంలో వైరల్ లోడ్ తగ్గి, వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ఐవీకి సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయని, బాధితులు మనోధైర్యంతో చికిత్స తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. వైద్య విజ్ఞానంలో అనేక మార్పులు వచ్చాయని, సరైన చికిత్స, మందుల వినియోగంతో ఆరోగ్యంగా, సంతోషంగా జీవించవచ్చని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో గన్నారం గ్రామ సర్పంచ్ జి. సుజాత శ్రీనివాస్, ఉపసర్పంచ్ కుమ్మరి వెంకటి, వార్డు సభ్యులు సాయిలు, నర్సయ్య, లావణ్య, మమత, సతీష్, గణేష్, మహేష్, పంచాయతీ కార్యదర్శి కె. శ్వేత, ఖరాబర్ మోహన్, వైఆర్జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీమ్ సూపర్వైజర్ మల్లికార్జున్, లింక్ వర్కర్లు మీనా, గౌతమి, అమీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});