CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 8:20 pm Posted By: coalbelt 24 News

ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల సమ్మె నోటీసు

డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతాం
జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన కార్మికులు
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది, సూపర్‌వైజర్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు సమ్మె నోటీసు, వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే డిసెంబర్ 7, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తామని కార్మికులు తెలిపారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులను ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్‌ (IHFMS) నుంచి ఐఎఫ్‌ఎంఐఎస్‌ (IFMIS)లో విలీనం చేయాలని, నెలకు రూ.26 వేల ఫిక్స్‌డ్‌ వేతనం డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT) ద్వారా నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం గతంలో ఎన్నోసార్లు ధర్నాలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కాంట్రాక్టర్లు చాలీచాలని వేతనాలు చెల్లిస్తున్నారని, పలువురు కార్మికులకు ఈపీఎఫ్‌, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. ఈపీఎఫ్‌, ఈఎస్ఐ వివరాలు అడిగితే ఖాతా నంబర్లు ఇవ్వడం లేదన్నారు. పలు ఆసుపత్రుల్లో ఈపీఎఫ్‌, ఈఎస్ఐ గురించి ప్రశ్నించిన కార్మికులను కాంట్రాక్టర్లు, సిబ్బంది వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి విధులకు రావద్దని హెచ్చరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. సమయపాలన లేకుండా ఓవర్‌టైమ్‌ విధులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికుల ప్రధాన డిమాండ్లు…..

  1. కనీస వేతన చట్టం ప్రకారం నెలకు రూ.26 వేల వేతనం చెల్లించి, డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఫిక్స్‌డ్‌ వేతనంగా అమలు చేయాలి. బెడ్‌సైడ్‌ కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేయాలి. ప్రతి కార్మికుడికి రూ.20 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఈపీఎఫ్‌లో యాజమాన్యం వాటాను ప్రభుత్వం చెల్లించాలి. మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా క్యాజువల్‌ సెలవులు మంజూరు చేయాలి. ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ కార్డు అందజేయాలి.

ఇవే కాకుండా తమకు ఎదురవుతున్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని కార్మికులు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలపై దయతలచి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్‌.కె. ఇబ్రహీం, డి. రమేష్‌, అన్వర్‌, శ్రీకాంత్‌, సాయి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});