ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కమలదళం
నితిన్ నబీన్ మహా పాదయాత్రకు లక్ష మందితో జనసమీకరణ
బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్
కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:
రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తన బలాన్ని చాటుకోవడంతో పాటు, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపే లక్ష్యంతో ఈ నెల 23న కరీంనగర్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్రను కమలదళం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొననున్న ఈ కార్యక్రమాన్ని భారీ రాజకీయ శక్తి ప్రదర్శనగా నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సుమారు లక్ష మందికి పైగా ప్రజలను సమీకరించి పాదయాత్రను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ ‘కోల్ బెల్ట్ న్యూస్’ ప్రతినిధితో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం – అరాచకాన్ని అంతం చేద్దాం’ అనే నినాదంతో ఈ మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రజలకు వాస్తవాలను వివరించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా విపక్షాల రాజకీయ ఆరోపణలకు సమాధానం చెప్పాలని బీజేపీ భావిస్తోందన్నారు.
కరీంనగర్‌లోని గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర వైశ్య భవన్, టవర్ సర్కిల్, గంజ్, గడియారం సర్కిల్, శాస్త్రీ రోడ్, భారత్ టాకీస్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు కొనసాగనుంది. సుమారు రెండున్నర కిలోమీటర్లకు పైగా సాగేలా రూట్ మ్యాప్ రూపొందించినట్లు రజనీష్ జైన్ వెల్లడించారు. వైశ్య భవన్ వద్ద నితిన్ నబీన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా మరింత బలోపేతం కావడం, ప్రజా సమస్యలపై తమ గళాన్ని వినిపించడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. భారీ జనసమీకరణతో కరీంనగర్ వేదికగా బీజేపీ తన రాజకీయ బలాన్ని చాటుకునేందుకు సిద్ధమవుతుండటంతో ఈ మహా పాదయాత్ర రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});