సీఐటీయూ మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లించిన యాజమాన్యం రిటైర్డ్ కార్మికులను విస్మరించడం సరికాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి అన్నారు. రిటైర్డ్ కార్మికులకు కూడా వెంటనే లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన మందమర్రిలో మాట్లాడుతూ .. రిటైర్డ్ కార్మికులకు చెల్లింపుల విషయానికి వచ్చేసరికి లేనిపోని నిబంధనలు, కొర్రీలు పెట్టడం సరికాదన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో క్వార్టర్ ఖాళీ చేస్తేనే లాభాల వాటా చెల్లిస్తామనే నిబంధనలు విధించకుండా, సింగరేణి సంస్థ అభివృద్ధిలో రిటైర్డ్ కార్మికులు అందించిన సేవలను గుర్తించి, వారి శ్రమను గౌరవిస్తూ వెంటనే లాభాల వాటా చెల్లించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రిటైర్డ్ కార్మికుల వైద్య సేవలకు సంబంధించిన సీఎంఆర్‌పీఎస్ (CPRMS) పథకాన్ని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని వెంకటస్వామి పేర్కొన్నారు.
అదేవిధంగా గత దసరా సందర్భంగా లాభాల వాటా చెల్లింపు సమయంలో రిటైర్డ్ కార్మికులకు సొంత ఇంటి కలను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఇప్పటివరకు దానికి సంబంధించిన విధివిధానాలను వెల్లడించకపోవడం విచారకరమన్నారు. దీంతో రిటైర్ అవుతున్న కార్మికులు క్వార్టర్లను ఖాళీ చేయకుండా ఉండిపోవాల్సి వస్తోందని, ఫలితంగా వారికి రావాల్సిన గ్రాట్యుటీ నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని, వారికి కూడా సొంతింటి కలను అమలు చేయడంతో పాటు లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లించాలని ఎస్. వెంకటస్వామి డిమాండ్ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});