జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో రైతు ధరావత్ రాజు క్షేత్రంలో జాతీయ ఆహార భద్రత–పోషకాహార మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎం) పథకం కింద వరి పంట క్షేత్రస్థాయి ప్రదర్శన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ రైతులకు నేరుగా వెదజల్లే సాగు పద్ధతిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎం పథకంలో భాగంగా వానాకాలం–2026 సీజన్‌లో కేఎన్‌ఎం–1638 వరి విత్తనాలను 50 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులకు 100 శాతం రాయితీపై పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు నాణ్యమైన విత్తనాలను అందించడం, ఆహార పంటల ఉత్పాదకతను పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.వానాకాలం–2026 సీజన్‌లో నేరుగా వెదజల్లే సాగు పద్ధతిని ప్రోత్సహించేందుకు కేఎన్‌ఎం–1638 వరి విత్తనాలను రైతులకు 100 శాతం రాయితీపై పంపిణీ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వెల్తూరి సురేఖ తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రైతులు వ్యవసాయ శాఖ అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని సురేఖ సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను రైతులు వినియోగించుకోవాలని కోరారు. కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి శాస్త్రవేత్త ఎన్. మహేశ్ మాట్లాడుతూ కేఎన్‌ఎం–1638 వరి వంగడం సాగు లక్షణాలు, అధిక దిగుబడుల సాధనకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, సరైన సమయంలో విత్తడం, సమతుల్య ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. చీడపీడలు, తెగుళ్లను ముందుగానే గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
చెన్నూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్ మాట్లాడుతూ నేరుగా వెదజల్లే సాగు పద్ధతితో నారుమడి పెంపకం, నారు పీకడం, నాట్లు వేయడం వంటి పనుల ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. కూలీల అవసరం, సాగు వ్యయం తగ్గడంతో పాటు నీటి వినియోగాన్ని ఆదా చేసుకుంటూ తక్కువ పెట్టుబడితో వరి సాగు చేపట్టవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి, మండల పంచాయతీ అధికారి మహేష్, గ్రామ సర్పంచ్ మాసు శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారి సైండ్ల కనకరాజు, పంచాయతీ కార్యదర్శి అరుణ్ రాజ్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});