తలకు తీవ్ర గాయం
పరారైన కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో కన్నతల్లిపైనే కుమారుడు రోకలి కర్రతో దాడి చేసిన ఘటన మందమర్రి పట్టణంలోని విద్యానగర్‌లో చోటుచేసుకుంది…సంఘటన వివరాలు స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నవి ……
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విద్యానగర్‌కు చెందిన గాదె సారక్క (65) చెన్నూరులో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు గాదె రాజమల్లు (46) విద్యానగర్‌లోని వారి సొంత ఇంట్లో నివసించేవాడు. అయితే కొంతకాలంగా ఇల్లు ఖాళీ చేయాలని తల్లి కోరుతుండటంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెలలో బంధువులు, పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా, దాని తీర్మానం మేరకు రాజమల్లు ఇల్లు ఖాళీ చేసి మందమర్రి హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెనుక భాగంలోని అద్దె ఇంటికి మారాడు.
అయితే తనను సొంత ఇంటి నుంచి బయటకు పంపించారనే కోపంతో తల్లిపై కక్ష పెంచుకున్న రాజమల్లు ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో శనివారం (14-11-2026) ఉదయం సుమారు 11 గంటల సమయంలో సారక్క చెన్నూరు నుంచి మందమర్రిలోని తన సొంత ఇంటికి చేరుకుంది. ఇంటి తాళం తీసి ఇద్దరూ లోపలికి వెళ్లిన అనంతరం ఇల్లు ఖాళీ చేసే విషయమై మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజమల్లు అక్కడే ఉన్న రోకలి కర్రతో తల్లి తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో సారక్క తలకు తీవ్ర రక్తగాయమై కిందపడిపోగా, నిందితుడు దాడికి ఉపయోగించిన రోకలి కర్రతో అక్కడి నుంచి పరారయ్యాడు.
నిందితుడి అరెస్ట్.. రోకలి కర్ర స్వాధీనం……
ఘటనపై సమాచారం అందుకున్న మందమర్రి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అదే రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యానగర్‌లోని నిందితుడి అద్దె ఇంటి వద్ద గాదె రాజమల్లును అదుపులోకి తీసుకున్నారు. పంచుల సమక్షంలో విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దాడికి ఉపయోగించి ఇంట్లో దాచిన రక్తపు మరకలు ఉన్న రోకలి కర్రను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నట్లు మందమర్రి ఎస్‌ఐ జి. నరేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});