CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 4:11 pm Posted By: coalbelt 24 News

ఎల్‌నినో వాతావరణ మార్పులపై విద్యార్థినులకు అవగాహన సదస్సు

ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత
పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎల్‌నినో వాతావరణ మార్పులు, వాటి కారణాలు, ప్రకృతి పరిరక్షణలో మానవ బాధ్యతపై కరీంనగర్‌లోని ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలికల డిగ్రీ, పీజీ కళాశాల వసతి గృహంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతిమిత్ర కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి ముకుందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రకృతిమిత్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ వాల్టా అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ తప్పిదాలు, ప్రకృతి వనరుల దుర్వినియోగం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం ఎల్‌నినో పరిస్థితులకు దారితీస్తోందని వివరించారు. మానవ తప్పిదాల వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడటం ఆందోళనకరమన్నారు. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల తీవ్రత తగ్గించేందుకు ప్రతి పౌరుడు భారత రాజ్యాంగంలోని 51A(g) అధికరణం ప్రకారం ప్రకృతి పరిరక్షణను తన బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ వర్షాభావ పరిస్థితులను అర్థం చేసుకొని నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకొని వర్షపు నీటిలో ప్రతి చుక్కను ఒడిసిపట్టాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిమిత్రులుగా మారి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎల్‌నినోపై అవగాహన కల్పించే ప్రత్యేక పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కరీంనగర్ జిల్లా ప్రకృతిమిత్ర సభ్యులతో కలిసి విద్యార్థినులతో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. జీవ రక్షక ట్రస్టు సహకారంతో పర్యావరణ మిత్ర సంచులను విద్యార్థినులకు ఉచితంగా పంపిణీ చేశారు.ప్రకృతిమిత్ర జిల్లా అధ్యక్షుడు కొత్తూరి ముకుందం, ప్రధాన కార్యదర్శి, న్యాయవాది ఎస్. హర్జిత్ సింగ్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి పరిరక్షణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి పౌరుడు ప్రకృతి వనరులను బాధ్యతగా, పొదుపుగా వినియోగించుకోవాలని, మొక్కలు నాటి వాటిని సంరక్షించి వృక్షాలుగా ఎదిగేలా చూడాలని కోరారు.

ప్రముఖ తెలంగాణ జానపద గాయని తేలు విజయ ప్రత్యేక ఆహ్వానితురాలిగా పాల్గొని ప్రకృతి పరిరక్షణపై తన పాటలతో విద్యార్థినులను అలరించారు. ప్రకృతిమిత్ర కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు.హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దేవనపల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఎల్‌నినో వాతావరణ మార్పులపై విద్యార్థినులకు విలువైన సమాచారాన్ని అందించి అవగాహన కల్పించిన ప్రకృతిమిత్ర సభ్యులను అభినందించారు. అనంతరం వారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో వృక్ష ప్రేమికుడు పల్లె సత్యనారాయణ, ప్రకృతిమిత్ర సభ్యులు గద్దె రవికుమార్, బత్తిని శ్రీనివాస్, సత్యనారాయణ, హాస్టల్ సిబ్బంది, విద్యార్థినులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});