కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉండగానే నిర్మాణాలు చేపట్టారని ఆరోపణ..
తొలగించాలని న్యూడెమోక్రసీ డిమాండ్
సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.శ్రీనివాస్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గర్మిళ్ల శివారు సర్వే నంబర్ 87లోని ప్రభుత్వ పోరంబోకు భూమిలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ప్రహరీ నిర్మాణం చేపట్టారని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆరోపించింది. దాదాపు రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పార్టీ నాయకులు విమర్శించారు. సర్వే నంబర్ 87లోని భూమిపై జి.వి. వసుమన్రావు, తండ్రి జి.వి. సుధాకర్‌రావు, ఇతరులు కోర్టును ఆశ్రయించారని నాయకులు తెలిపారు. ఈ కేసులు కొనసాగుతున్న సమయంలో 2023లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ తరఫున కూడా ఈ భూమి ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ కోర్టులో కేసు దాఖలైనట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తుది తీర్పు వెలువడే వరకు భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇతర ప్రైవేట్ వ్యక్తులు కూడా కోర్టును ఆశ్రయించగా, భూమిపై యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించినట్లు తెలిపారు.
అయితే నవంబర్ 1, 2 తేదీల్లో జి.వి. వసుమన్రావు, ఆయన అనుచరులు సదరు భూమి చుట్టూ ఇనుప స్తంభాలు ఏర్పాటు చేసి రేకులతో ప్రహరీ నిర్మాణం చేపట్టారని న్యూడెమోక్రసీ నాయకులు ఆరోపించారు. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ నిర్మాణం జరుగుతున్న సమయంలో సంబంధిత అధికారులు అడ్డుకోలేదని విమర్శించారు. ప్రహరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, నిర్మించిన రేకుల ప్రహరీని తొలగించాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ప్రతినిధి బృందం నవంబర్ 10న జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గురువారం సాయంత్రం సదరు భూమి వివాదంలో ఉందని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు.
అయితే నిర్మాణం జరుగుతున్న సమయంలోనే అధికారులు ఎందుకు అడ్డుకోలేదని పార్టీ నాయకులు ప్రశ్నించారు. వారం రోజుల తర్వాత ప్రహరీని తొలగించకుండా కేవలం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని నిలదీశారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, తహసీల్దార్ తదితర సంబంధిత అధికారులు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదేనని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణం చేపట్టిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. నిర్మించిన ప్రహరీని తొలగించి, భూమి చుట్టూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరింది.
ప్రహరీని తొలగించకపోతే మంచిర్యాల పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులను కలుపుకొని ప్రజల సహకారంతో తామే ప్రహరీని తొలగిస్తామని నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.శ్రీనివాస్, పార్టీ జిల్లా కార్యదర్శి ఏ. లాల్‌కుమార్, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం. జ్యోతి, ఏఐకేఎంఎస్ కార్యదర్శి రత్నం తిరుపతి, ఉపాధ్యక్షులు దొండ ప్రభాకర్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు సింగిరెడ్డి తిరుపతి, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంతెన మల్లన్న, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్, పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});