28వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయాలి
ఎంపీడీవోకు ఎంసీపీఐ(యు) వినతి
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో కేవలం కాగితాలకే పరిమితమవుతోందని ఎంసీపీఐ(యు) పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ విమర్శించారు. ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ 28వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఎంసీపీఐ(యు) పార్టీ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ.. గతంలో 24-08-2026న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఇదే సమస్యపై దరఖాస్తు సమర్పించామని, DMNCL24082600139 నంబర్‌తో నమోదు చేసిన ఆ దరఖాస్తుపై ఇప్పటివరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నిర్లక్ష్యపు సమాధానాలే ఎదురవుతున్నాయని, సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు.ప్రజల చెంతకే పాలన అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులకే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుపై విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 28వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు తాగునీటి సమస్య నుంచి విముక్తి కల్పించాలని కోరారు.లేనిపక్షంలో 28వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ సౌకర్యం అందని ప్రజలందరినీ సమీకరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యు) బెల్లంపల్లి మండల కార్యదర్శి తొగరి రాహుల్ పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});