మూడు నెలలుగా నిలిచిన బస్సుల రాకపోకలు..
ప్రయాణికులు, విద్యార్థులకు తప్పని అవస్థలు
అధికారుల నిర్లక్ష్యంపై ఎంసీపీఐయూ నాయకుల అసంతృప్తి
వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
పట్టణంలోని కొత్త బస్టాండ్‌లోకి గత మూడు నెలలుగా బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంసీపీఐయూ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్‌లో ఏర్పడిన గుంత కారణంగా బస్సుల రాకపోకలను నిలిపివేసినప్పటికీ, ఇంతవరకు సమస్యను పరిష్కరించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ మేరకు శనివారం ఎంసీపీఐయూ పార్టీ నాయకులు బెల్లంపల్లి కొత్త బస్టాండ్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ.. బస్టాండ్‌లో గుంత ఏర్పడటంతో గత మూడు నెలలుగా బస్సులను లోపలికి అనుమతించడం లేదన్నారు. దీంతో ప్రయాణికులు, ముఖ్యంగా విద్యార్థులు బస్టాండ్ వెలుపలే బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
బస్టాండ్ సమస్యపై సింగరేణి మైనింగ్ అధికారులు వచ్చి పరిశీలించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బెల్లంపల్లి ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తోందని విమర్శించారు. మూడు నెలలుగా సమస్య పరిష్కారం కాకపోవడానికి మంచిర్యాల, ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ల బాధ్యతారాహిత్యమే కారణమని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా మంచిర్యాల, ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్లు, మంచిర్యాల జిల్లా కలెక్టర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి తక్షణమే స్పందించి బస్టాండ్‌లో ఏర్పడిన గుంతను పూడ్చి, బస్సులు తిరిగి బస్టాండ్ లోపలికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయూ బెల్లంపల్లి మండల కార్యదర్శి తోగరి రాహుల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});