సమస్యలు పరిష్కరించకుంటే మరో వినూత్న పోరాటానికి సిద్ధం
సిఐటియు డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజేందర్
కోల్ బెల్ట్ న్యూస్(రామకృష్ణాపూర్):
సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చడంలో యాజమాన్యం, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే కార్మికులందరినీ ఏకం చేసి మరో తరహా వినూత్న పోరాటానికి సిద్ధం చేస్తామని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజేందర్, బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి హెచ్చరించారు. రామకృష్ణాపూర్ సీహెచ్‌పీలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యం, ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
లాభాల వాటా ప్రకటన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రస్తావించిన కార్మిక సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సెప్టెంబర్‌లోనే అమలు చేయాల్సిన యాక్టింగ్ ప్రమోషన్లను ఇప్పటివరకు ఇవ్వకపోయినా గుర్తింపు సంఘం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సీఎంపీఎఫ్ నిల్వలను ఎందుకు వెల్లడించడం లేదో యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల సింగరేణి సంస్థకు ఆర్థిక నష్టం జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన డివిడెండ్‌ను తీసుకుంటూ మౌనంగా ఉండటం సరైన విధానం కాదన్నారు.
దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికులకు సంబంధించిన 12వ వేతన ఒప్పందం విషయంలో తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు.సింగరేణి సంస్థకు ఆర్థిక నష్టం కలిగించే రాజకీయ జోక్యంతో కార్మికులకు అందాల్సిన రక్షణ పరికరాల సరఫరా కూడా సక్రమంగా జరగని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్న పరిణామాలను కార్మికులు గమనించాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగానే ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా సింగరేణిని ఆర్థికంగా నష్టపరిస్తే రానున్న ఎన్నికల్లో కార్మికుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సంస్థలో జరుగుతున్న ఆర్థిక దోపిడీని అరికట్టి, కార్మికులకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఇటీవల పెన్షన్, బోనస్ అంశాలపై ఏఐటీయూసీ నాయకులు చేస్తున్న ఆరోపణలను కార్మికులు విశ్వసించడం లేదని సీఐటీయూ నాయకులు అన్నారు.
పెన్షన్ బోర్డులో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు సీఐటీయూ చేసిన ప్రతిపాదనల కారణంగానే కొంతమేర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పెన్షన్ బోర్డు సభ్యులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. కార్మికుల హక్కుల సాధన కోసం సీఐటీయూ చేస్తున్న నిస్వార్థ పోరాటాలకు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకనే కొందరు నాయకులు విమర్శలకు దిగుతున్నారని అన్నారు. విమర్శలకు భయపడకుండా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు లింగాల సత్యనారాయణ, కార్యదర్శి గుజ్జ సతీష్, పిట్ ఇన్చార్జి అయిందాల శ్రీనివాస్, అంజన్నతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});