ప్రకృతి హితమైన పండుగే లక్ష్యంగా ప్రకృతి తెలంగాణ అవగాహన కార్యక్రమం
కాలుష్యాన్ని వెదజల్లే టపాసులకు దూరంగా ఉండాలి
మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించాలి
ప్రకృతిమిత్ర రాష్ట్ర వ్యవస్థాపకుడు గుండేటి యోగేశ్వర్.
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
ప్రకృతి పరిరక్షణే లక్ష్యంగా, ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రకృతి తెలంగాణ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ రోడ్డులోని ‘ప్రకృతి మిత్ర’ రాష్ట్ర కార్యాలయ ఆవరణలో కాలుష్య రహిత దీపావళి నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టి ప్రమిదలతో తయారు చేసిన దీపాలను ప్రదర్శించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించి, కాలుష్య నివారణ, ప్రకృతి హితమైన దీపావళి నిర్వహణపై నినాదాలు చేశారు. అనంతరం కాలుష్య రహిత దీపావళి జరుపుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ కార్యక్రమంలో ప్రకృతి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ వాల్టా అథారిటీ పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ.. దీపావళి అంటే నూనె దీపాల వరుస అని, కాలుష్యాన్ని వెదజల్లే బాంబుల వరుస కాదని పేర్కొన్నారు. ప్రజలందరూ ప్రకృతికి, మూగజీవాలకు హాని కలగకుండా మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగిస్తూ సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బాణసంచా వల్ల వెలువడే విషపూరిత వాయువులు, అధిక శబ్దాలు గర్భిణులు, వృద్ధులు, చిన్నారులతో పాటు మూగజీవాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గాలి, శబ్ద కాలుష్యం కారణంగా గుండె, నాడీ వ్యవస్థ, కంటి, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని, పర్యావరణ పరిరక్షణ చట్టాలను గౌరవిస్తూ కాలుష్యానికి కారణమయ్యే టపాసులను స్వచ్ఛందంగా నిషేధించాలని కోరారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారితో కాలుష్య రహిత దీపావళి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా అగ్నిమాపక, అటవీ శాఖ అధికారులు సత్యనారాయణ, రమేష్ బాబు, సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. బాణసంచా వల్ల గాలి, శబ్ద, నీటి కాలుష్యం అధికమవుతుందని, ప్రజలు వాటిని కాల్చకుండా పర్యావరణ హితమైన దీపావళికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే పరిమితంగా వినియోగించాలని తెలిపారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే 101 నంబర్‌కు ఫోన్ చేసి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని సూచించారు. ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో నిరంతరంగా కొనసాగుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా అభినందించారు.

మహిళలు రాచకొండ చందన, చిప్ప జ్యోతి, స్వర్ణలత, హేమ తదితరులు మాట్లాడుతూ.. దీపావళిని కాలుష్యరహితంగా, సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. టపాసులు, బాంబులు, చిచ్చుబుడ్లకు బదులుగా దీపాలు వెలిగించి కేదారేశ్వరి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత వ్యవసాయ అధికారి కస్తూరి నాగేశ్వర్, ప్రకృతి మిత్ర సభ్యులు, కలెక్టరేట్ ఏరియా కాలనీవాసులు, ఓమాక్స్ విల్లా నివాసితులు ఉషారాణి, పుష్ప, మమత, విజయ, అనిత, రజిత తదితరులతో పాటు అగ్నిమాపక, అటవీ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});