1,100 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణకు యాజమాన్యం సానుకూల నిర్ణయం
ఏఐటీయూసీ విజ్ఞప్తికి స్పందనగా సర్క్యులర్ జారీ
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న బదిలీ ఫిల్లర్లు, జనరల్ అసిస్టెంట్ ట్రైనీల క్రమబద్ధీకరణకు సంబంధించి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు 1,100 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జనరల్ అసిస్టెంట్ ట్రైనీల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన సర్క్యులర్‌ను సింగరేణి యాజమాన్యం నవంబర్ 5న జారీ చేసింది. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) చేసిన నిరంతర ప్రయత్నాలు, యాజమాన్యానికి అందించిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం కార్మిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్బంగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి తో మాట్లాడుతూ సింగరేణి సంస్థలో బదిలీ ఫిల్లర్లుగా, జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గుర్తింపు సంఘం తరఫున యాజమాన్యానికి గతంలో వినతిపత్రం సమర్పించామన్నారు. ప్రధానంగా 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్ణీత 190/240 మస్టర్లు పూర్తి చేసిన ఉద్యోగులకు న్యాయం చేయాలని యూనియన్ కోరింది. ఉద్యోగుల సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వారి సేవలను పరిగణనలోకి తీసుకుని క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు.
ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సింగరేణి యాజమాన్యం, 31-12-2025 నాటికి లేదా అంతకుముందు నియమితులై, 2025 డిసెంబర్ 31 వరకు ఏదైనా క్యాలెండర్ సంవత్సరంలో నిర్ణీత 190/240 మస్టర్లను పూర్తి చేసిన బదిలీ ఫిల్లర్లు, జనరల్ అసిస్టెంట్ ట్రైనీల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలతో సర్క్యులర్ జారీ చేసిందన్నారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు 1,100 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని ఆయన వివరించారు.
కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, వారి సర్వీసు సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం చేస్తున్న నేపథ్యంలోనే కార్మికుల అపరిష్కృత సమస్యలు వెంట, వెంట పరిస్కారమవుతున్నాయన్నారు. కార్మికుల సమస్యలను గుర్తించి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడం, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం ద్వారా గుర్తింపు సంఘంగా తమ బాధ్యతను నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు.సుమారు 1,100 మంది ఉద్యోగుల జీవితాల్లో భరోసా నింపే ఈ నిర్ణయం పట్ల సంబంధిత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకత్వానికి సింగరేణి కార్మిక వర్గం కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});