ఫ్రెషర్స్ డే వేడుకల్లో ప్రతిభకు పట్టాభిషేకం
విద్యార్థులకు ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ దిశానిర్దేశం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
వివేకవర్ధిని డిగ్రీ అండ్ పీజీ కళాశాల, మంచిర్యాల ఆధ్వర్యంలో అందుగులపేటలోని శ్రీ కన్వెన్షన్‌లో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయం 2021–2023 విద్యా సంవత్సరానికి గాను గోల్డ్ మెడల్ సాధించి కళాశాలకు కీర్తిప్రతిష్ఠలు తీసుకొచ్చిన విద్యార్థిని నుజాత్ అంజుమ్‌ను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, అధ్యాపక బృందం ఘనంగా సన్మానించి అభినందించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదలతో నిరంతరం కృషి చేయాలని సూచించారు. కలలు కనడం మాత్రమే కాకుండా, వాటిని సాకారం చేసుకునే వరకు అంకితభావంతో శ్రమించాలని పిలుపునిచ్చారు. విజయం ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదని, దాని వెనుక నిరంతర శ్రమ, క్రమశిక్షణ, పట్టుదల ఉంటాయని పేర్కొన్నారు. నుజాత్ అంజుమ్ సాధించిన గోల్డ్ మెడల్ ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
కళాశాల కరస్పాండెంట్ డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి మాట్లాడుతూ, విద్య అనేది వ్యక్తి జీవితాన్ని మార్చడమే కాకుండా సమాజ అభివృద్ధికి దోహదపడే శక్తివంతమైన సాధనమని అన్నారు. విద్యార్థులు కేవలం డిగ్రీలు పొందడమే లక్ష్యంగా కాకుండా, ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా తమ ప్రతిభను, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అపజయాలకు భయపడకుండా వాటిని విజయానికి మెట్లుగా భావించాలని, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు షరీనా బి., రమేష్, శ్రీలేఖ, వైష్ణవి, పవిత్ర, శ్రీనివాస్, తిరుపతి, సతీష్, సమీర్, మమత, మౌనిక తదితరులు పాల్గొన్నారు. నుజాత్ అంజుమ్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఫ్రెషర్స్ డే వేడుకలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు, ప్రతిభకు ప్రోత్సాహం అందించే వేదికగా నిలిచాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});