CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 5:46 pm Posted By: coalbelt 24 News

బియ్యం ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

ప్రభుత్వ నిర్ణీత ధరలకే విక్రయాలు జరపాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
కోల్ బెల్ట్ న్యూస్(జైపూర్);

ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బియ్యం ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట ధరలకు మించి బియ్యం విక్రయిస్తే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో సమత రైస్ డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల అవుట్‌లెట్‌ను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళ, మండల తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. నిత్యావసరమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. బియ్యం ధరల నియంత్రణ, అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులతో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయని తెలిపారు. తనిఖీలకు వచ్చే అధికారులకు వ్యాపారులు, ట్రేడర్లు పూర్తి సహకారం అందించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయాలు జరిపితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

అవుట్‌లెట్‌లో బియ్యం ధరల వివరాలు:…….

సమత రైస్ డిపో నిర్వాహకులు 26 కిలోల బరువుతో కూడిన బియ్యం బస్తాలను నిబంధనల ప్రకారం నిర్ణీత ధరలకు విక్రయించనున్నట్లు తెలిపారు.

  • ప్రీమియం క్వాలిటీ బి.పి.టి. న్యూ రైస్ – రూ.1,352
  • స్టీమ్ రైస్ – రూ.1,482
  • పాత బియ్యం – రూ.1,638
  • హెచ్.ఎం.టి. పాత రకం బియ్యం – రూ.1,950
  • జై శ్రీరామ్ పాత బియ్యం – రూ.1,976

ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించడంతో పాటు మార్కెట్‌లో ధరల స్థిరీకరణకు ఈ అవుట్‌లెట్ దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});