కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
ఎంసీపీఐయు జిల్లా నాయకుల డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు ఆరు రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు.
ఈరోజు నిర్వహించిన ఎంసీపీఐయు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఎల్‌పీజీ ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో పేద ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయం వేదికగా ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు రేషన్ కార్డుదారులకు మరికొన్ని నిత్యావసర సరుకులు అందించాలని అధికారులను ఆదేశించినప్పటికీ, ఆ హామీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చకపోవడం విచారకరమన్నారు.
మంత్రి ప్రకటించిన ఆరు నిత్యావసర సరుకులైన కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి, పసుపు పంపిణీ చేస్తామని చెప్పిన మాటలు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం సరైన విధానం కాదన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు ప్రకటించిన ఆరు రకాల నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోవాలని వారు కోరారు.ఈ సమావేశంలో ఎంసీపీఐయు బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్, బెల్లంపల్లి మండల కార్యదర్శి తోగరి రాహుల్, రాజేష్, ఆకాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});