CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 10:40 am Posted By: coalbelt 24 News

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు
స్పందించకపోతే భారీ ఉద్యమం చేపడతాం:
పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఎన్‌హెచ్‌ఎం (NHM) ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మంగళవారం తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల పోరాటానికి తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సలేంద్ర కొమురయ్య యాదవ్ మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం, వారి సేవలను క్రమబద్ధీకరించడం, ప్రతి నెలా వేతనాలను సకాలంలో చెల్లించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని అన్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) సౌకర్యాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఇతర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని విడనాడి తక్షణమే చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉద్యోగులకు అండగా నిలిచి, వారి హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బొంగోని శంకరయ్య గౌడ్, తెలంగాణ రక్షణ సేన బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉస్తం శ్రీనివాస్, కారుపాకల రమేష్‌తో పాటు పలువురు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});