ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తాం
సీఎం ఇంటి ముట్టడికి యత్నం
బెల్లంపల్లిలో ఏడుగురు ముందస్తు అరెస్టు
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించకుండా, వారి హక్కుల కోసం గళమెత్తుతున్న వారిని అరెస్టు చేయడం బాధాకరమని తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించాలని నిర్ణయించుకున్న ఉద్యమకారులను అడ్డుకుని, ముందస్తుగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సాధన కోసం కేసులను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన ప్రభుత్వం, వారి ఆందోళనలను అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఎం నివాస ముట్టడికి బయలుదేరిన వారిని బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ముందస్తుగా నిర్బంధించడం ద్వారా వారి నిరసన హక్కును అడ్డుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమకారుల ఆరు ప్రధాన డిమాండ్లు:
తెలంగాణ ఉద్యమకారులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలి. తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు నెలవారీ పెన్షన్లు అందించాలి.ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి ఇల్లు మంజూరు చేయాలి.రైళ్లు, బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ పాసులు జారీ చేయాలి.ప్రతి ఉద్యమకారుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి రూ.20 లక్షల వరకు వర్తించే ఆరోగ్య బీమా కార్డులు అందించాలి.
ముందస్తు అరెస్టయిన ఉద్యమకారులు:
బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ముందస్తుగా అరెస్టు చేసిన వారిలో తెలంగాణ ఉద్యమకారులు ఎలిగేటి శ్రీనివాస్, చిట్యాల మధు, శంకర్ సింగ్, పసులేటి వెంకటేష్, ఎరుకల సుందరరావు, విజ్జగిరి రాజేందర్, గద్దల ధర్మేందర్ ఉన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});