CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 7:52 pm Posted By: coalbelt 24 News

అధిక సాంద్రత పత్తి సాగుతో ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి

అందుగులపేటలో పత్తి చేను పరిశీలించిన అధికారులు
కాటన్ డెవలప్‌మెంట్ డైరెక్టరేట్ సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రియాంక్ గైక్వాడ్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

కేంద్ర ప్రభుత్వ కపాస్ క్రాంతి పథకం – మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో చేపట్టిన అధిక సాంద్రత పత్తి సాగు అమలు తీరును నాగ్‌పూర్‌లోని కాటన్ డెవలప్‌మెంట్ డైరెక్టరేట్ సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రియాంక్ గైక్వాడ్ మంగళవారం పరిశీలించారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా మందమర్రి మండలం అందుగులపేట గ్రామానికి చెందిన రైతు ఏనుగు ఆశిరెడ్డి సాగు చేసిన పత్తి చేనును సందర్శించి, సాగు విధానం, పంట ఎదుగుదల, దిగుబడి అంచనాల గురించి రైతును అడిగి తెలుసుకున్నారు. పంట పరిస్థితి ఆశాజనకంగా ఉందని, ఎకరాకు సుమారు 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు వివరించడంతో శాస్త్రవేత్త సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని పత్తి రైతులందరూ అధిక సాంద్రత సాగు విధానాన్ని అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ఆయన సూచించారు. నీటిలో కరిగే స్థూల, సూక్ష్మ పోషకాలను వినియోగించడంతో పాటు రసం పీల్చే పురుగుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మెపిక్వాట్ క్లోరైడ్ వినియోగంతో మొక్కల ఎదుగుదలను నియంత్రించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

ఎకరాకు సుమారు 24 వేల మొక్కలను నాటి, ఒక్కో మొక్కకు 10 నుంచి 15 కాయలు వచ్చినప్పటికీ ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించే అవకాశం ఉందని వివరించారు. అధిక సాంద్రత పత్తి సాగు ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, వచ్చే ఏడాది వానాకాలం సీజన్‌లో ఈ సాగు విధానాన్ని విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరి సురేఖ, ఏడీఏ బానోత్ ప్రసాద్, మందమర్రి మండల వ్యవసాయ అధికారి జి. కిరణ్మయి, ఏఈఓ సైండ్ల కనకరాజు, పలువురు రైతులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});