CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 10:50 pm Posted By: coalbelt 24 News

గడువులోగా యు.డి.ఐ.డి., సదరం లక్ష్యాలు పూర్తి చేయాలి

పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):

యు.డి.ఐ.డి., సదరం కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, గ్రామీణ అభివృద్ధి, సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాల్లో యు.డి.ఐ.డి., సదరం శిబిరాల నిర్వహణను వేగవంతం చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న యు.డి.ఐ.డి. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అర్హులైన దివ్యాంగులను గుర్తించి, వారికి అవసరమైన వైద్య పరీక్షలు, ధ్రువీకరణ ప్రక్రియను సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఏకరూప దుస్తుల తయారీ పనుల పురోగతిని సమీక్షించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలో యు.డి.ఐ.డి., సదరం కార్యక్రమాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీ పనులను కూడా త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీధర్, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి అంజయ్య, డీపీఎం అన్నాజీ, మెప్మా పీడీ సుభాష్, విద్యాశాఖ సిబ్బంది, సదరం డీఈఓలు తదితరులు పాల్గొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});