మనోవికాస్ పాఠశాలలో వర్ధంతి వేడుకలు
విద్యార్థులకు పండ్ల పంపిణీ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సట్ల సంతోష్ గౌడ్, తుంగపిండి రాజేష్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన కృషి, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు, ధైర్యసాహసాలతో కూడిన నాయకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ‘గరీబీ హటావో’ నినాదంతో పేదల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. 1969లో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసి సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. హరిత విప్లవానికి ప్రోత్సాహం అందించి వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదలకు దోహదపడ్డారని పేర్కొన్నారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో దేశానికి నాయకత్వం వహించారని గుర్తుచేశారు. దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆమె చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గోపిశెట్టి వీరన్న, నాయకులు తుంగపిండి విజయ్, ధనుక్ రాజేష్, కొత్తకొండ రాయమల్లు, తుంగపిండి రామ్, సూరజ్, అజయ్, కుమ్మం రాజు, ప్రవీణ్, జూపాక రమేష్, సాంబయ్య, పి. రమేష్ తదితరులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});