మందమర్రిలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..
180 యూనిట్ల రక్తం సేకరణ
బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సమాజ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలను సైతం అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
శుక్రవారం మందమర్రిలోని ఎం.వి.టి.సి.లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం ద్వారా ప్రాణదానం చేయడమే పోలీసు అమరవీరులకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన పోలీసుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. ప్రజా సంక్షేమం, సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పర్సా రమేష్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు నరేష్, గంగారాం, శ్రీధర్, శ్రావణ్ సమిష్టిగా కృషి చేసి రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. రెడ్‌క్రాస్ సొసైటీ బృందం వైద్య, సాంకేతిక ఏర్పాట్లు చేపట్టి రక్త సేకరణ ప్రక్రియను పర్యవేక్షించింది. ఈ శిబిరంలో మొత్తం 220 మంది రక్తదానం కోసం పేర్లు నమోదు చేసుకోగా, 180 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. మందమర్రి సర్కిల్ పోలీసు సిబ్బందితో పాటు స్థానిక యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పెద్ద సంఖ్యలో రక్తదానం చేసి సామాజిక సేవలో భాగస్వాములయ్యారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});